ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయిన సీఎం కేసీఆర్..
KCR Meet With Uddhav Thackeray. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్
By Medi Samrat Published on 20 Feb 2022 4:13 PM IST
బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ముంబయిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఒకరోజు పర్యటన నిమిత్తం ముంబై వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం సీఎం ఠాక్రేను ఆయన నివాసంలో కలిసిన ఆయన, ఆయనతో కలిసి భోజనం చేశారు. మహారాష్ట్ర సీఎంను కలిసిన తర్వాత కేసీఆర్.. శరద్ పవార్ నివాసానికి వెళతారు. అక్కడ ఇద్దరు నేతలు జాతీయ రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.
కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సమైక్యతను నిర్విర్యం చేస్తోందని బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. కాషాయ పార్టీని దేశం నుంచి తరిమి కొట్టాలని, లేకుంటే దేశం సర్వనాశనం అవుతుందని కేసీఆర్ ఇటీవల భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. బీజేపీని అధికారం నుంచి తరిమికొట్టేందుకు రాజకీయ శక్తులు కలిసి రావాలని తెలంగాణ సీఎం పిలుపునిచ్చారు. బిజెపికి వ్యతిరేకంగా వివిధ ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో కెసిఆర్.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా కలవాలని యోచిస్తున్నారు.