ముగిసిన కేసీఆర్, కేజ్రీవాల్ చర్చలు.. నేడు మరికొంత మందితో భేటీ..
KCR, Kejriwal discuss alternative national agenda. ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాను రూపొందించే ప్రయత్నంలో భాగంగా పలువురు
By Medi Samrat
ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాను రూపొందించే ప్రయత్నంలో భాగంగా పలువురు ప్రతిపక్ష నేతలను కలిసేందుకు ప్రస్తుతం దేశ వ్యాప్త పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో ఆయన నివాసంలో చర్చించారు. మరికొద్ది నెలల్లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలతో పాటు.. 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని ఎదుర్కొనేందుకు రాజకీయ సమీకరణాలు రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఒక గంటపాటు సాగిన లంచ్ సమావేశంలో ఇద్దరు నేతలు ప్రస్తుత జాతీయ రాజకీయాలు, ఫెడరల్ స్ట్రక్షర్, భారతదేశ వృద్ధిలో రాష్ట్రాల సహకారం, కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఇతర సమస్యలతో సహా అనేక అంశాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశంలో ఇరువురు ముఖ్యమంత్రులు అనేక ఉమ్మడి ప్రయోజనాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు.. ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాను రూపొందించడానికి సమాన ఆలోచనలు గల శక్తులను ఏకతాటిపైకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ వెంట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, జే సంతోష్ కుమార్, జీ రంజిత్ రెడ్డి, బీ వెంకటేష్ నేతతో పాటు ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సహా ఆప్ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
శనివారం నుంచి వారం రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. రానున్న రెండు రోజుల్లో ఢిల్లీలోని ప్రముఖ రాజకీయ నేతలు, ఆర్థికవేత్తలు, జర్నలిస్టులతో సమావేశాలను కొనసాగించనున్నారు. మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్‌డి దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామితో సమావేశం అవడం కోసం ఆయన మే 26న బెంగళూరుకు వెళ్లనున్నారు. మే 27న రాలేగాన్ సిద్ధిలో సామాజిక కార్యకర్త అన్నా హజారేతో సమావేశమవుతారు. అనంతరం హైద్రాబాద్‌కు తిరుగుపయనమవుతారు.