కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. అత్యాచారాన్ని ఆస్వాదించాల‌ట‌

Karnataka MLA makes shocking Comments.క‌ర్ణాట‌క కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అత్యాచారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Dec 2021 9:34 AM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. అత్యాచారాన్ని ఆస్వాదించాల‌ట‌

క‌ర్ణాట‌క కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అత్యాచారం అనివార్య‌మైన‌ప్పుడు.. దాన్ని ఆనందంగా ఆస్వాదించడ‌మే ఉత్త‌మ‌మంటూ అసెంబ్లీ సాక్షిగా దారుణ‌మైన, అస‌హ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై పెద్ద దుమార‌మే రేగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీంతో ఆయ‌న్ను వెంట‌నే సస్పెండ్ చేయాల‌ని సొంత పార్టీ నేత‌లే అంటున్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేష్ కుమార్ గతంలో సభకు స్పీకర్‌గా కూడా వ్యవహరించారు.

ఇటీవల సంభవించిన వరదలు, పంట నష్టంపై గురువారం అసెంబ్లీ స‌మావేశంలో చ‌ర్చ‌ను చేప‌ట్టారు. ఒక‌రి త‌రువాత మ‌రొక‌రు మాట్లాడుతున్నారు. వారిని నియంత్రించ‌డం స్పీక‌ర్ విశ్వేశ్వ‌ర్ హెగ్డే క‌గేరీకి క‌ష్టంగా మారింది. ఈ స‌మ‌యంలో స్పీక‌ర్ మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం తాను ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నాననంటే ప్ర‌తి దానికి అవును.. అవును అంటూ ఉండాలి అంతే అని న‌వ్వుతూ వ్యాఖ్యానించారు. స్పీక‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ర‌మేష్ కుమార్ స్పందిస్తూ.. అత్యాచారం అనివార్య‌మైన‌ప్పుడు ఆనందంగా దాన్ని ఆస్వాదించాలి అని ఓ సామెత ఉంది. మీరిప్పుడు స‌రిగ్గా అలాంటి ప‌రిస్థితుల్లోనే ఉన్నారు అంటూ వ్యాఖ్యానించాడు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

తాజాగా ర‌మేష్ కుమార్ చేసిన వ్యాఖ్య‌ల‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. 'అత్యాచారం గురించి అసెంబ్లీలో నేను ఉదాసీన‌, నిర్ల‌క్ష్య వ్యాఖ్య‌ల‌కు గానూ క్ష‌మాప‌ణ‌లు తెలియ‌జేస్తున్నా. అత్యాచారం వంటి క్రూర‌మైన నేరాన్ని తేలిక‌గా తీసుకోవాల‌నే ఉద్దేశంతో నేనా వ్యాఖ్య‌లు చేయ‌లేదు. అనుకోకుండా అలా జ‌రిగిపోయింది. ఇక మీద‌ట ఆచితూచి జాగ్ర‌త్త‌గా మాట్లాడ‌తాన‌ని' ర‌మేష్ ట్వీట్ చేశారు.

కాగా.. ర‌మేష్‌కుమార్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం కొత్తేమీ కాదు. అప్ప‌ట్లో తాను స్పీక‌ర్‌గా ఉన్న స‌మ‌యంలోనూ దాదాపు ఇలాంటి వ్యాఖ్య‌లే చేశారు. తన పరిస్థితి అత్యాచార బాధితురాలిలా ఉందని ఆయ‌న చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి.

Next Story