విషాదం.. గుండెపోటుతో మంత్రి ఉమేష్ క‌త్తి క‌న్నుమూత‌

Karnataka Minister Umesh Katti dies of cardiac arrest.కర్ణాట‌క రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Sep 2022 2:59 AM GMT
విషాదం.. గుండెపోటుతో మంత్రి ఉమేష్ క‌త్తి క‌న్నుమూత‌

కర్ణాట‌క రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర‌ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్ విశ్వనాథ్ కత్తి క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 61 సంవ‌త్స‌రాలు. డాల‌ర్స్ కాల‌నీలో మంత్రి నివాసం ఉంటున్నారు. మంగ‌ళ‌వారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో గుండెపోటుతో బాత్ రూమ్‌లో కుప్ప‌కూలిపోయారు. గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు వెంట‌నే ఆయ‌న్ను ఎంఎస్ రామ‌య్య ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే ఆయ‌న మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు.

ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చే స‌మ‌యానికే ఉమేష్ విశ్వానాథ్ క‌త్తికి ప‌ల్స్ లేద‌ని వైద్యులు చెప్పిన‌ట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అశోక్ తెలిపారు. ఆయ‌న మృతి బీజేపీకి బెళ‌గాని జిల్లా ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోటు అని వ్యాఖ్యానించారు. మంత్రి ఉమేష్ విశ్వనాథ్ కత్తి మృతి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

సీఎం దిగ్భ్రాంతి..

మంత్రి ఉమేష్ క‌త్తి హ‌ఠాణ్మ‌ర‌ణంపై సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు."రాష్ట్రం నిపుణుడైన దౌత్యవేత్తను, చురుకైన నాయకుడిని, నమ్మకమైన ప్రజా సేవకుడిని కోల్పోయిందంటూ" ట్వీట్ చేశారు.

ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. "ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అంటూ ట్విట్ చేశారు.

తండ్రి విశ్వనాథ్ కత్తి 1985లో కాలం చేసిన తర్వాత ఉమేశ్ కత్తి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆరు సార్లు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన హుక్కేరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2008లో బీజేపీలో చేర‌డానికి ముందు జ‌న‌తాపార్టీ, జ‌న‌తాద‌ళ్‌, జేడియూ, జేడీఎస్ పార్టీలో ప‌ని చేశారు. జేహెచ్ ప‌టేల్‌, బీఎస్ యాడ్యూర‌ప్ప‌, డీవీ స‌దానంద గౌడ, జ‌గ‌దీష్ షెట్ట‌ర్ మంత్రి వ‌ర్గాల్లో మంత్రిగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంలో రెండు పోర్ట్‌ఫోలియోలను నిర్వహిస్తున్నారు. అటవీ, ఆహారం పౌర సరఫరా శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Next Story