ప్ర‌ధాని చెప్పార‌ట‌.. మాస్క్ పెట్టుకోను అంటున్న మంత్రి

Karnataka minister refuses to wear mask.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి పంజా విసురుతోంది. దీంతో రోజువారి పాజిటివ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2022 2:47 PM IST
ప్ర‌ధాని చెప్పార‌ట‌.. మాస్క్ పెట్టుకోను అంటున్న మంత్రి

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి పంజా విసురుతోంది. దీంతో రోజువారి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి క‌ట్ట‌డికి మాస్క్‌లు ధ‌రించ‌డంతో పాటు భౌతిక దూరం పాటించాల‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విష‌యాన్ని అన్నిమార్గాల్లో ప్ర‌చారం చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌డం లేదు. ఏమీ తెలియ‌ని సామాన్యులు ఇలా చేశారంటే అర్థం చేసుకోవ‌చ్చు కానీ.. సాక్షాత్తు అన్ని తెలిసిన ఓ మంత్రి గారు ఇలా చేయ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాను ఎట్టిప‌రిస్థితుల్లోనూ మాస్క్ ధ‌రించ‌న‌ని తెగేసి చెబుత‌న్నారు. ఇంత‌కూ ఎవ‌రా మంత్రి అంటారా..? క‌ర్ణాట‌క రాష్ట్ర‌ అట‌వీ శాఖ మంత్రి ఉమేశ్ క‌ట్టి.

వివ‌రాల్లోకి వెళితే.. క‌ర్ణాట‌క రాష్ట్రం బెళ‌గావిలో ఓ కార్య‌క్ర‌మానికి మంగ‌ళ‌వారం అట‌వీ శాఖ మంత్రి ఉమేశ్ క‌ట్టి హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాస్క్ లేకుండా క‌నిపించ‌డంతో అక్క‌డ ఉన్న వారు ఆయ‌న్ను ఈ విష‌య‌మై ప్ర‌శ్నించారు. మాస్క్ అంటే త‌న‌కు ఇష్టం లేద‌ని, అందుకే పెట్టుకోన‌ని మంత్రి చెప్పుకొచ్చారు. 'మాస్క్ ధ‌రించ‌డంపై ఎటువంటి ఆంక్ష‌లు లేవు. అది ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త మాత్ర‌మే అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చెప్పారు. మాస్క్ పెట్టుకోవాలా వ‌ద్దా అన్న‌ది ప్ర‌జ‌ల ఇష్టం. దాన్ని ధ‌రించ‌డం నాకు ఇష్టం లేదు కాబ‌ట్టి.. నేను మాస్క్ పెట్టుకోలేదు. ఇది నా వ్య‌క్తిగ‌త నిర్ణ‌యం' అని మంత్రి ఉమేశ్ క‌ట్టి చెప్పారు. మంత్రిగారు చెప్పిన స‌మాధానం విని అక్క‌డ ఉన్న‌వారు విస్తుపోయారు.

ప్ర‌స్తుతం మంత్రి గారు మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఇక దేశ వ్యాప్తంగా అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్న రాష్ట్రాల్లో క‌ర్ణాట‌క కూడా ఒక‌టి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 41,457 పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

Next Story