'పాకిస్తాన్ జిందాబాద్' అన్నందుకు కొట్టి చంపారు.. వివరాలు వెల్లడించిన హోం మంత్రి
పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది.
By Medi Samrat
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది. మరోవైపు కర్ణాటక రాజధాని బెంగళూరులో మూక హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు ఓ యువకుడిని కొట్టి చంపారు. మృతుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వరా సమాచారం అందించారు. మృతుడు 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశాడని.. దీంతో జనం ఆగ్రహానికి గురయ్యారని, అందరూ అతనిపై దాడి చేశారని చెప్పారు.
ఈ ఘటనపై సమాచారం ఇస్తూ కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. బెంగళూరులో మూక హత్య ఉదంతం వెలుగులోకి వచ్చిందన్నారు. మృతి చెందిన వ్యక్తిని ఇంకా గుర్తించలేదు. స్థానిక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేశాడు. ఇది విని పక్కనే ఉన్న కొందరు ఆగ్రహానికి గురై అతడిని కొట్టడం ప్రారంభించారు. చివరికి ఆ యువకుడు చనిపోయాడని తెలిపారు. బెంగళూరులో జరిగిన ఈ హత్య ఘటన తర్వాత పోలీసులు యాక్షన్‌లోకి దిగారు. గుంపు దాడిలో పాల్గొన్న 10-12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం విచారణలో ఉంది. ప్రతి ఒక్కరూ శాంతిభద్రతలను కాపాడాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉన్న బైసరన్ లోయలో ఏప్రిల్ 22 న ఉగ్రవాద దాడి జరిగింది. ఈ సమయంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను హతమార్చారు. దాడి అనంతరం భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాక్ పౌరులంతా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.