కన్నడ భాషపై వ్యాఖ్యలు..కమల్‌హాసన్‌పై కర్ణాటక హైకోర్టు సీరియస్
కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు, పొలిటీషియన్ కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు సీరియస్ అయింది.
By Knakam Karthik
కన్నడ భాషపై వ్యాఖ్యలు..కమల్‌హాసన్‌పై కర్ణాటక హైకోర్టు సీరియస్
కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు, పొలిటీషియన్ కమల్ హాసన్‌పై కర్ణాటక హైకోర్టు సీరియస్ అయింది. ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు వాక్ స్వాతంత్య్రం హక్కును దుర్వినియోగం చేయొద్దని ఆయనను హెచ్చరించింది. తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారిన "కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది" అనే వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని కమల్‌కు హైకోర్టు మంగళవారం సూచించింది. కన్నడ భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు థగ్‌లైఫ్ సినిమాను ప్రదర్శించకూడదన్న కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు నటుడు కమల్ హాసన్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది.
"మీరు సామాన్యులు కారు. మీకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, కానీ ఇతరుల మనోభావాలను గాయపరిచే హక్కు లేదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేంతగా ప్రాథమిక హక్కును వినియోగించుకోలేరు. ఇప్పుడు మేం ఈ విషయాన్ని మీకే వదిలేస్తున్నాం.. మీ వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణ చెప్పండి" అని కోర్టు పేర్కొంది. కమల్ హాసన్ కొత్త సినిమా 'థగ్ లైఫ్' గురువారం విడుదల కానున్న నేపథ్యంలో, "కర్ణాటక నుంచి కోట్ల రూపాయల ఆదాయం రావచ్చు... కానీ కన్నడ ప్రజలు వద్దనుకుంటే ఆ ఆదాయాన్ని వదులుకోవాల్సి ఉంటుంది" అని కోర్టు వ్యాఖ్యానించింది.
తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే మద్దతుతో కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే, తన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. "నా జీవితం, నా బంధుత్వం తమిళం. మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది, కాబట్టి మీరు కూడా అందులో భాగమే" అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని, లేదంటే కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా విడుదలను అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కూడా ఇదే ప్రకటన చేయడంతో కమల్ హాసన్ కోర్టుకెక్కారు.