కర్ణాటకలో కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
కేంద్ర ప్రభుత్వం తీరుపై కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి
By Srikanth Gundamalla Published on 16 Jun 2023 3:33 PM ISTకర్ణాటకలో కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
కేంద్ర ప్రభుత్వం తీరుపై కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేద్దామంటే కేంద్రం మోకాలడ్డుతోందని మండిపడ్డారు. దీంతో.. కేంద్రం తీరుకు నిరసనగా కర్ణాటక వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరిత రాజకీయాలు చేస్తోందని డీకే శివకుమార్ ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చామన్నారు. 'అన్న భాగ్య' పథకం కింద పేద కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి 10 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలను మెచ్చిన రాష్ట్ర ప్రజలు తమ పార్టీని గెలిపించారని చెప్పారు డీకే శివకుమార్. కానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) నుంచి అవసరమైన బియ్యం కర్ణాటక ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని.. మోకాలడ్డిందని మండిపడ్డారు. ఎఫ్‌సీఐ నుంచి రాష్ట్రాలు బియ్యం కొనుగోలు చేసే నిబంధనల్లో మార్పు చేసిందని చెప్పారు. కేవలం ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే ఎఫ్‌సీఐ నుంచి బియ్యం కొనుగోలు చేసేలా చట్టాల్లో మార్పులు చేశారని ఆయన ఆరోపించారు. దీంతో.. కావాల్సినన్ని బియ్యం ఎఫ్‌సీఐ నుంచి కొనుగోలు చేసేందుకు వీలులేకుండా పోయిందని చెప్పారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.
ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా.. ప్రజలకు మంచి చేసే ప్రయత్నాలను మాత్రం తాము ఆపబోమని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీని కచ్చితంగా నెరవేర్చి తీరతామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విద్వేషరాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని కర్ణాటక సర్కార్ నిర్ణయించింది. జూన్ 20న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని డీకే శివకుమార్ పిలుపునిచ్చారు.