కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పలు రాష్ట్రాలలోని 31 ప్రదేశాలలో సోదాలు నిర్వహించిన అధికారులు, పెద్దమొత్తంలో ఆన్‌లైన్, ఆఫ్ లైన్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నట్లు గుర్తించారు. గ్యాంగ్‌టక్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని సోదరుడు కేసీ తిప్పేస్వామి, మేనల్లుడు పృథ్వి ఎన్ రాజ్, ఇతర కుటుంబీకులకు సంబంధించిన ఆస్తులు, గోవాలోని కాసినోలపై దాడులు నిర్వహించిన ఈడీ సుమారు రూ. 12 కోట్ల నగదు, ఆరు కోట్లు బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి, వాహనాలు, ఆస్తి పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కింగ్ 567, పప్పీస్003, రాజా 567, రత్న గేమింగ్ వంటి బెట్టింగ్ వెబ్ సైట్స్ నడుపుతున్నట్లు తేల్చిన అధికారులు, ఆయన సోదరుడు దుబాయ్ బెట్టింగ్ సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపారు.
వీరేంద్ర, అతని సహచరులు ఇటీవల క్యాసినో కోసం భూమిని లీజుకు తీసుకోవడానికి బాగ్డోగ్రా మీదుగా గ్యాంగ్‌టక్‌కు ప్రయాణించారని దర్యాప్తులో వెల్లడైంది. అక్రమ ఆదాయాన్ని దాచడానికి పలు ప్రయత్నాలు చేసినట్లుగా పలు పత్రాలు, డిజిటల్ ఆధారాలు లభించాయని ED అధికారులు తెలిపారు.