కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఫలితాలపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆయన కుటుంబంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. సిద్ధరామయ్య బావ కన్నుమూశారు. సిద్ధరామయ్య సోదరి శివమ్మ భర్త రామే గౌడ (69) ఆకస్మికంగా మరణించారు. రామే గౌడ ఈ ఉదయం అస్వస్థతకు గురికావడంతో జేఎస్‌ఎస్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తుండగా ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రామేగౌడకు భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం హత్తూరులో అంత్యక్రియలు జరగనున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు. అమిత్ షా, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్ వంటి నేతల ప్రభావం కర్ణాటక ప్రజలపై లేదని స్పష్టమైందన్నారు. ఇదే ఊపుతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు. బీజేపీ, వారి అవినీతి, దుష్పరిపాలనతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయారు.. వారివి ప్రజా వ్యతిరేక రాజకీయాలని ఆయన చెప్పుకొచ్చారు.