అసెంబ్లీలో ఆ వీడియోలు చూస్తూ దొరికిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ
Karnataka Congress Leader Prakash Rathod caught watching obscene videos in council.ఆయనో ప్రజాప్రతినిధి. అసెంబ్లీలో
By తోట వంశీ కుమార్
ఆయనో ప్రజాప్రతినిధి. అసెంబ్లీలో కూర్చొని ప్రజా సమస్యలపై మాట్లాడాలి. వారి కోసం పోరాటం చేయాలి. అలాంటి ఓ ప్రజాప్రతినిధి దారి తప్పాడు. తన హోదాను, ఎక్కడ ఉన్నానో అన్న సంగతి మరిచిపోయాడు. ఏకంగా అసెంబ్లీలోనే అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. దీంతో ఆయనపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటన కర్ణాటక విధాన పరిషత్ సమావేశంలో జరిగింది.
రెండు విడుతలుగా నిర్వహిస్తున్న కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభం అయ్యాయి. తొలి రోజే ప్రభుత్వం 11 బిల్లుల్ని ప్రవేశపెట్టింది. వీటిపై రెండోరోజైన శుక్రవారం అసెంబ్లీలో, మండలిలో కీలక చర్చ జరిగింది. బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ సమావేశాలను పట్టించుకోకుండా సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూడడంలో మునిగిపోయారు. ఇది గమనించిన ఓ టీవీ చానల్ కెమెరామెన్ దానిని చిత్రీకరించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే ఆయన్ను సస్సెండ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.
అయితే.. ఈ వార్తలను ప్రకాశ్ రాథోడ్ ఖండించారు. తాను ఆ వీడియోలు చూడలేదన్నారు. గ్రామీణాభివృద్ధిపై మంత్రితో మాట్లాడుతున్నానని.. దానికి సంబంధించిన ప్రశ్నల కోసం సెల్‌ఫోన్‌లో వెతుకుతున్నానన్నారు. సెల్‌ఫోన్‌లో డేటా నిండిపోవడంతో.. కొన్ని డిలీట్ చేసినట్లు వివరణ ఇచ్చారు.ఇలా అభ్యంతరకర వీడియోలు చూస్తూ సభ్యులు దొరికిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2012లో ముగ్గురు బీజేపీ మంత్రులు ఇలానే అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయారు. ఈ ఘటన తర్వాత అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడాన్ని నిషేధించారు.