సిద్ధరామయ్యతో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనుంది వీరే..!

Karnataka CM Swearing In Ceremony Full List Of Ministers In Siddaramaiah Cabinet. నేడు కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం చేయ‌నుంది.

By Medi Samrat  Published on  20 May 2023 5:52 AM GMT
సిద్ధరామయ్యతో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనుంది వీరే..!

నేడు కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం చేయ‌నుంది. కర్ణాటక కొత్త సీఎంగా పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులుగా ప్రమాణం చేయ‌నున్న‌ పేర్లను కూడా వెల్లడించారు. సీఎంతో పాటు జీ పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహోళి, ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, బీజే జమీర్ అహ్మద్ ఖాన్ లు మంత్రులుగా ప్రమాణం చేయనున్న‌ట్లు తెలుస్తోంది.

మంత్రిపదవితో కూడా కుల సమీకరణాలను చక్కదిద్దేందుకు కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డుతోంది. జి పరమేశ్వర, ప్రియాంక్ ఖర్గే, కెహెచ్ మునియప్ప దళిత సామాజికవర్గం నుంచి కాగా.. మైనారిటీ-క్రైస్తవ వర్గానికి చెందిన కేజే జార్జ్, లింగాయత్ సామాజికవర్గం నుంచి ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహోళి ఎస్టీ వాల్మీకి వర్గం, రామలింగ రెడ్డి రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు, బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ మైనారిటీ ముస్లిం వర్గానికి చెందినవారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధరామయ్య కురుబ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన వారు.

మంత్రి పదవుల కోసం పేర్లను నిర్ణయించడానికి కాంగ్రెస్ కూడా పూర్తి మేధోమథనం చేసింది. శుక్రవారం రాత్రి వ‌ర‌కూ డికె శివకుమార్, సిద్ధరామయ్య ఢిల్లీలోనే ఉన్నారు. ఇద్దరూ పార్టీ హైకమాండ్‌తో మంత్రులు, వారికి కేటాయించే శాఖల పేర్ల గురించి చర్చించారు. కర్ణాటకలో సీఎం పదవి ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం అందింది. కర్ణాటక సీఎం ప్రమాణస్వీకారోత్సవం ద్వారా విపక్షాల ఐక్యత సందేశం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. 2013లో కూడా ఈ స్టేడియంలోనే సిద్ధరామయ్య సీఎంగా ప్రమాణం చేశారు.

గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ పర్యవేక్షణలో మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభం కానుంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. వీరితో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్న‌ట్లు తెలుస్తోంది.


Next Story