కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను సమర్థించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రజా సేవలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన నిధులు సమకూరుస్తుందని చెప్పారు.
పెట్రోలు, డీజిల్ ధరలను లీటరుకు రూ. 3, రూ. 3.5 చొప్పున పెంచినందుకు ప్రతిపక్ష బిజెపి, దాని మిత్రపక్షం జెడి (ఎస్) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. దక్షిణ రాష్ట్రాలలో పెంపు తర్వాత కూడా ఇంధనంపై పన్నులు చాలా తక్కువగా ఉన్నాయని సిద్ధరామయ్య అన్నారు. సమతుల్యమైన, బాధ్యతాయుతమైన పాలనకు రాష్ట్రం కట్టుబడి ఉంది” అని సిద్ధరామయ్య ఉద్ఘాటించారు.
కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్‌పై 29.84 శాతం, డీజిల్‌పై 18.44 శాతానికి వ్యాట్‌ను పెంచింది. ఈ పెంపు తర్వాత కూడా ఇంధనంపై మన రాష్ట్ర పన్నులు.. దక్షిణ భారత రాష్ట్రాలు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల కంటే తక్కువగా ఉన్నాయి అని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
వ్యాట్ పెంపు ఉన్నప్పటికీ, గుజరాత్, మధ్యప్రదేశ్‌ల కంటే కర్ణాటకలో డీజిల్ ధరలు ఇప్పటికీ తక్కువగా ఉన్నాయని, "మా పౌరులకు ఇంధన ధరలను సహేతుకంగా ఉంచడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని ముఖ్యమంత్రి అన్నారు.
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించిన ప్రతిపక్ష బీజేపీపై కూడా ఆయన మండిపడ్డారు. ‘‘కర్ణాటక వనరులను ఇతర రాష్ట్రాలకు మళ్లించేందుకు అప్పటి డబుల్ ఇంజిన్ బీజేపీ ప్రభుత్వం సహకరించిందని ఆరోపించారు. రాష్ట్రంలోని గత బిజెపి ప్రభుత్వం చేసిన ఈ అవకతవకల వల్ల కర్నాటకకు ఆదాయం తగ్గిందని, “కేంద్ర ప్రభుత్వం తన ఖజానాకు ఎక్కువ వసూలు చేసి, కన్నడిగులను మోసం చేసిందని” ఆయన ఆరోపించారు.