కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు గురించి చర్చ జరుగుతుంది. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సిఎం డీకే శివకుమార్ మార్పు ఉండదని బయటకు చెబుతూ ఆ వార్తలను ఖండిస్తున్నారు. అయినా, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తయిన తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయనకు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు ప్రతిరోజూ ఇలాంటి వాదనలు చేస్తున్నారు.
ఇంతలో, కర్ణాటకలో సీఎం పదవి ఖాళీ లేదని, 50-50 ఫార్ములా అమలు చేయబోమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెద్ద ప్రకటన చేశారు. మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదని డీకే శివకుమార్ స్వయంగా చెప్పారన్నారు. నేనే ముఖ్యమంత్రిని, ఈ పదవిలో కొనసాగుతాను.. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదు అన్నారు.
నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బుధవారం స్వయంగా తోసిపుచ్చారు. ప్రస్తుతం మంత్రివర్గాన్ని మార్చే ఆలోచన లేదని ఆయన అన్నారు. అవన్నీ మీడియా ఊహాగానాలేనని, అలాంటి ప్లాన్ ఏమీ లేదని అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించేందుకు నేను, సీఎం కేంద్ర మంత్రులను కలుస్తున్నామని స్పష్టం చేశారు.