ఢిల్లీలో డీకే మద్దతుదారులు.. అదే జ‌రిగితే సిద్ధరామయ్యే ఐదేళ్లు సీఎం..!

ముఖ్యమంత్రి పదవి విషయంలో కర్ణాటక కాంగ్రెస్‌లో కొనసాగుతున్న టగ్ ఆఫ్ వార్ ఇప్పుడు న్యూఢిల్లీకి చేరుకుంది.

By -  Medi Samrat
Published on : 24 Nov 2025 4:39 PM IST

ఢిల్లీలో డీకే మద్దతుదారులు.. అదే జ‌రిగితే సిద్ధరామయ్యే ఐదేళ్లు సీఎం..!

ముఖ్యమంత్రి పదవి విషయంలో కర్ణాటక కాంగ్రెస్‌లో కొనసాగుతున్న టగ్ ఆఫ్ వార్ ఇప్పుడు న్యూఢిల్లీకి చేరుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మద్దతుగా ఎమ్మెల్యేలు న్యూఢిల్లీకి వెళ్లడంతో చర్చ మరింత జోరందుకుంది. ఎమ్మెల్యేల‌ బృందం ఆదివారం రాత్రి న్యూఢిల్లీకి చేరుకుంది. అందులో కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా త్వరలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని, తద్వారా శివకుమార్‌ను ముఖ్యమంత్రిని చేసే అంశాన్ని పార్టీ అగ్రనేతల ముందు ఉంచవచ్చని కూడా వర్గాలు భావిస్తున్నాయి.

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 20 నాటికి తన ఐదేళ్ల పదవీకాలంలో సగం పూర్తి చేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య ఉన్న‌ 'అధికార భాగస్వామ్యం' ఒప్పందం గురించి చర్చలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇప్ప‌టికే డీకే శివ‌కుమార్‌కు వ‌చ్చే రెండున్న‌రేళ్ల పాటు సీఎం ప‌ద‌వి ఇస్తారేమో అనే చ‌ర్చ జోరందుకుంది.

న్యూఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో హెచ్‌సి బాలకృష్ణ (మాగడి), కెఎం ఉదయ్ (మద్దూరు), నయన మోటమ్మ (ముదిగెరె), ఇక్బాల్ హుస్సేన్ (రామానగర్), శరత్ బాచిగౌడ్ (హోస్కోటే), శివగంగ బసవరాజ్ (చానగారి) ఉన్నారు.

పార్టీలో ఓ వైపు టగ్ ఆఫ్ వార్ కొనసాగుతున్నా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఆయ‌న త్వరలో ఢిల్లీ వెళ్ల‌నున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా త్వరలో విదేశాల నుండి తిరిగి రావచ్చు. గత వారం కూడా శివకుమార్‌కు మద్దతుగా దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి ఖర్గేను కలిశారు. అయితే ఎమ్మెల్యే ఢిల్లీ వెళ్లే విషయం తనకు తెలియదని శివకుమార్ అప్పట్లో చెప్పారు. ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం బెంగళూరులో ఖర్గేతో గంటకు పైగా సమావేశమయ్యారు.

వర్గాల సమాచారం ప్రకారం.. సిద్ధరామయ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను కోరుకుంటున్నట్లు వార్త‌లు రాగా.. శివకుమార్ ముఖ్యమంత్రి పదవిపై పార్టీలో ముందుగా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఆమోదముద్ర వేస్తే.. సిద్ధరామయ్య పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేస్తారు. ఇది శివకుమార్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలను తగ్గిస్తుంది.

Next Story