కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు లంచం తీసుకుంటూ లోకాయుక్తకు అడ్డంగా దొరికిపోయాడు.
దావణగెరె జిల్లా చన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప మదల్ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్‌డీఎల్) ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన కొడుకు ప్రశాంత్ మదల్ తన కార్యాలయంలో గురువారం రూ.40 లక్షలు తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వ అవినీతి నిరోధక శాఖ ఆయన నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. రూ.6కోట్లను గుర్తించారు.
తన నుంచి లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఓ వ్యక్తి వారం క్రితం లోకాయుక్తను ఆశ్రయించాడు. దీంతో ప్రశాంత్‌ను పట్టుకునేందుకు లోకాయుక్త అధికారులు వల పన్నారు. ప్రశాంత్ రూ. 40 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ప్రశాంత్ తన తండ్రి తరపున లంచం తీసుకుంటున్నాడని అనుమానిస్తున్నామని, అతని కార్యాలయంలో దొరికిన డబ్బు ఎక్కడిదనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని లోకాయుక్తకు చెందిన ఓ అధికారి తెలిపారు.