హెచ్చరిక.. అలాంటి గోబీ మంచూరియా తింటున్నారా.?

ఆరోగ్య సమస్యల దృష్ట్యా పుడ్ క‌ల‌ర్ వాడే కాటన్ క్యాండీ, గోబీ మంచూరియాలపై కర్ణాటక ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

By Medi Samrat  Published on  11 March 2024 5:22 PM IST
హెచ్చరిక.. అలాంటి గోబీ మంచూరియా తింటున్నారా.?

ఆరోగ్య సమస్యల దృష్ట్యా పుడ్ క‌ల‌ర్ వాడే కాటన్ క్యాండీ, గోబీ మంచూరియాలపై కర్ణాటక ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో రోడమైన్-బితో సహా కృత్రిమ ఆహార రంగుల వాడకాన్ని కర్ణాటక ప్రభుత్వం సోమవారం నిషేధించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు హెచ్చరించారు. కాటన్ క్యాండీ, గోబీ మంచూరియాలోకి ఉపయోగించే కలర్లు ఏ మాత్రం నాణ్యత లేనివని.. వాటి కారణంగా ప్రజల మీద తీవ్ర ప్రభావం పడడమే కాకుండా.. ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలువురు వైద్యులు ఇచ్చిన రిపోర్టులు ఆందోళన కలిగిస్తూ ఉండడంతో పలు రాష్ట్రాలలో కాటన్ క్యాండీపై బ్యాన్ ను విధించారు.

కర్ణాటకలో 171 గోబీ మంచూరియన్ నమూనాలను సేకరించగా, 64 సురక్షితంగా ఉన్నాయని, 106 హానికరమైనవని తేలింది. మొత్తం 25 కాటన్ క్యాండీ నమూనాలను సేకరించగా, వాటిలో 10 సురక్షితమైనవి, 15 ప్రమాదకరమైనవని తేలింది. టార్ట్రాజైన్, కార్మోయిసిన్, సన్‌సెట్ ఎల్లో, రోడమైన్-1బి వంటి కొన్ని కృత్రిమ రంగులు శాంపిల్స్ లో ఉపయోగించినట్లు కనుగొన్నారు. హోటళ్లు, రోడ్‌సైడ్ షాపుల నుండి నమూనాలు సేకరించారు. చాలా వరకు ప్రమాదకరమైనవి అని రావు విలేకరులతో తెలిపారు. గోబీ మంచూరియన్, కాటన్ క్యాండీ లలో కృత్రిమ రంగులను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. ఈ కృత్రిమ రంగులు కలిగిన స్నాక్స్ తీసుకోవడం క్యాన్సర్‌తో సహా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని తెలిపారు. కర్ణాటక ఆరోగ్య శాఖ ఈ అవసరమైన చర్యను తీసుకుంది. ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలను కోరారు.

Next Story