న‌టి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు కోర్టులో ఎదురుదెబ్బ‌..!

బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కి పంజాబ్‌, హర్యానా హైకోర్టు నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

By Medi Samrat
Published on : 1 Aug 2025 4:22 PM IST

న‌టి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు కోర్టులో ఎదురుదెబ్బ‌..!

బాలీవుడ్ నటి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కి పంజాబ్‌, హర్యానా హైకోర్టు నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. భటిండా కోర్టులో తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ పరువునష్టం ఫిర్యాదును రద్దు చేయాలంటూ కంగనా రనౌత్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తి త్రిభువన్ దహియాతో కూడిన సింగిల్ బెంచ్.. ఆమెపై 499 మరియు 500 IPC సెక్షన్ల కింద ప్రాథమికంగా కేసు నమోదు చేయబడిందని.. మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్ల ఉత్తర్వు చట్టబద్ధమైనదని స్పష్టం చేసింది.

రైతుల ఉద్యమం సందర్భంగా కంగనా చేసిన ఓ ట్వీట్‌కు సంబంధించి ఈ వివాదం నెలకొంది. ఓ ట్వీట్‌ను రీట్వీట్ చేయ‌గా అందులో.. 'హ హ హ.. టైమ్ మ్యాగజైన్‌లో అత్యంత ప్రభావవంతమైన భారతీయురాలిగా వచ్చిన అమ్మమ్మ ఈమే.. రూ.100కే దొరుకుతుంది' అని రాసి ఉంది. ఈ రీట్వీట్‌లో బటిండా నివాసి మహీందర్ కౌర్ ఫోటో ఉంది. ఆమె ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో నిరసన తెలుపుతున్న మహిళలతో తనను తప్పుగా లింక్ చేయడం ద్వారా కంగ‌నా తన ప్రతిష్టను దెబ్బతీశార‌ని కోర్టులో ఫిర్యాదు చేసింది.

కంగనాకు వ్యతిరేకంగా సమన్లు జారీ చేస్తున్నప్పుడు మేజిస్ట్రేట్.. ఈ ప్రకటన ఆమె ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని.. పబ్లిక్ ఫిగర్ కాబట్టి కంగనా మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని అభిప్రాయపడ్డారు. అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత చట్టపరమైన ప్రక్రియను అనుసరించి మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేశారని, నివేదిక అందనప్పటికీ, ప్రక్రియ చట్టబద్ధంగా ఉందని హైకోర్టు పేర్కొంది.

కంగనా ట్వీట్‌లో ఆమె ఉద్దేశాలు చెడ్డవి కావని, 'మంచి నమ్మకం'తో ఆమె ఈ ట్వీట్ చేసిందని, అయితే కోర్టు దానిని అంగీకరించలేదని కంగనా తరపున వాదించారు. అలాగే కంగనాపై మాత్రమే ఫిర్యాదు వేశారని, అసలు ట్వీట్ చేసిన గౌతమ్ యాదవ్‌ను ఫిర్యాదులో చేర్చలేదన్న వాదన కూడా తోసిపుచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Next Story