రష్యన్ ఇంధన కొనుగోలు వ్యవహారంలో భారత్‌కు అమెరికా 30 రోజుల పాటు 'తాత్కాలిక మినహాయింపు' ఇవ్వడంపై నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి ఆయన 'X' వేదికగా ఒక బహిరంగ లేఖను రాశారు.
భారత్ ఒక స్వతంత్ర, సార్వభౌమ దేశమని, విదేశాల నుండి ఆదేశాలు తీసుకునే స్థితిలో తాము లేమని ఆయన స్పష్టం చేశారు. "మేము స్వేచ్ఛాయుత దేశ పౌరులము. సుదూర విదేశీ తీరాల నుండి వచ్చే ఆదేశాలను పాటించాల్సిన అవసరం మాకు లేదు. మీ పని మీరు చూసుకోండి" అంటూ కమల్ హాసన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
జాతీయ విధానాల విషయంలో భారత్ తీసుకునే నిర్ణయాలు స్వతంత్రమైనవని, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని ఆయన అమెరికాకు హితవు పలికారు. సార్వభౌమ దేశాల మధ్య పరస్పర గౌరవం ఉన్నప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో, రష్యా నుండి ఇంధనాన్ని కొనుగోలు చేసే భారత రిఫైనరీలకు అమెరికా మినహాయింపు ప్రకటించడాన్ని తప్పుబడుతూ కమల్ హాసన్ దేశ ప్రయోజనాలను, ఆత్మగౌరవాన్ని ఈ లేఖ ద్వారా చాటిచెప్పారు.