కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేము: కేంద్ర ప్రభుత్వం

Kaleshwaram project cannot be given national status. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది

By Medi Samrat  Published on  21 July 2022 5:50 PM IST
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేము: కేంద్ర ప్రభుత్వం

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ 2016 ఫిబ్రవరిలో, 2018 డిసెంబరులో ప్రధానమంత్రికి లేఖ రాశారని గుర్తుచేశారు. అయితే ఆ ప్రాజెక్టుకు ఇన్వెస్ట్‌మెంట్ (పెట్టుబడుల) క్లియరెన్సు లేనందున హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర తుడు స్పష్టం చేశారు. జాతీయ ప్రాజెక్టుగా పరిగణించడానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయని, అందులో పెట్టుబడుల క్లియరెన్సు కూడా ఒకటని, ఇది లేకుండా జాతీయ ప్రాజెక్టుల జాబితాలో కాళేశ్వరం ప్రాజెక్టును చేర్చలేమని రాతపూర్వకంగానే కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే తొలుత కేంద్ర జల సంఘం అధ్యయనం జరిపి తన అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత అడ్వయిరీ కమిటీ ఆమోదం తెలియజేయాల్సి ఉంటుందని వివరించారు.

ఆ తర్వాత ఆ ప్రాజెక్టును నిర్మిస్తున్న సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల క్లియరెన్సును పొందాల్సి ఉంటుందని వివరించారు. క్లియరెన్సులు వచ్చిన తర్వాత జాతీయ ప్రాజెక్టుగా పరిగణించడానికి తగిన అర్హతలు, ప్రమాణాలు ఉన్నట్లు ఆయా శాఖలు భావిస్తే ఇందుకోసం ఏర్పాటైన హై పవర్డ్ స్టీరింగ్ కమిటీ అధ్యయనం చేసి జాబితాలో చేర్చడానికి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ కమిటీ నిశితంగా అధ్యయనం జరిపిన తర్వాత జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి అన్ని అర్హతలూ ఉన్నట్లు భావించి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లయితే నిధుల లభ్యత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తదనుగుణమైన నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు సమాధానం ఇచ్చారు.









Next Story