ఉక్రెయిన్ పై రష్యా దాడి.. పుతిన్‌కు పిచ్చి ప‌ట్టింది

KA Paul Reacts On Russia Ukraine War Issue.ఉక్రెయిన్‌పై ర‌ష్యా ప్రారంభించిన యుద్దం మూడో రోజుకు చేరుకుంది. బాంబుల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Feb 2022 5:55 PM IST
ఉక్రెయిన్ పై రష్యా దాడి.. పుతిన్‌కు పిచ్చి ప‌ట్టింది

ఉక్రెయిన్‌పై ర‌ష్యా ప్రారంభించిన యుద్దం మూడో రోజుకు చేరుకుంది. బాంబుల మోత‌తో ఉక్రెయిన్ ద‌ద్ద‌రిల్లుతోంది. ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ ని స్వాధీనం చేసుకునే దిశ‌గా ర‌ష్యా బ‌ల‌గాలు ముందుకు సాగుతున్నాయి. ఏ నిమిషం ఏ ప్ర‌మాదం ముంచుకొస్తుందో తెలియ‌క అక్క‌డి ప్ర‌జ‌లు ప్రాణాలను అర‌చేతిలో పెట్టుకుని అండ‌ర్ గ్రౌండ్ మెట్రో స్టేష‌న్ల‌లో త‌ల‌దాచుకుంటున్నారు. ప్ర‌పంచ దేశాల నుంచి వెలువెత్తున్న నిర‌స‌న‌ల‌ను, ఆంక్ష‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు రష్యా అధ్య‌క్షుడు పుతిన్. ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గేదే అంటూ త‌న‌దైన నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్నాడు.

తాజాగా.. ఉక్రెయిన్, రష్యా సంక్షోభంపై ప్రపంచ శాంతి దూత కె.ఎ.పాల్ స్పందించారు. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ వ్య‌వ‌హార శైలిపై ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. 69 ఏళ్ల వ‌య‌సులో పుతిన్‌కు పిచ్చి ప‌ట్టింద‌న్నారు. ఇక యుద్దాన్ని ఆపాల‌ని తాను చాలా రోజుల నుంచే కృషి చేస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు. 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపారు. ఉక్రెయిన్‌లో పరిస్థితులను తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఉందన్నారు.

ఉక్రెయిన్ కు సైన్యాన్ని పంపాల‌ని గ‌తనెల‌లోనే అమెరికా అధ్య‌క్షుడు బైడెన్‌కు చెప్పిన‌ట్లు తెలిపారు. అయితే.. అప్పుడు స‌రేన‌న్న బైడెన్ ఇప్పుడు వెనుకంజ వేసిన‌ట్లు చెప్పారు. బైడెన్‌కు క‌ళ్లు నెత్తికెక్కాయని మండిపడ్డారు. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రాస్ ను కూడా కేఏ పాల్ వ‌దిలిపెట్ట‌లేదు. గుటెర్రాస్ కు బుర్ర పనిచేయడం లేదన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి పెద్ద విషయమేం కాదని అంటున్నారని మండిపడ్డారు. యుద్ధాన్ని ఆపలేని ఆయన ఆ పదవిలో ఎందుకని ప్రశ్నించారు పాల్‌.

Next Story