నగదు కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడు, ఆయన ఇంట్లో తగలబెట్టిన కరెన్సీ నోట్లు లభ్యం కావడంతో వివాదంలో చిక్కుకున్నారు. ఈ వివాదం తర్వాత, ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆయన 2025 ఏప్రిల్ 5న పదవీ బాధ్యతలు స్వీకరించారు.
జస్టిస్ వర్మపై అంతర్గత విచారణ కూడా జరుగుతోంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన విచారణ కమిటీ రాబోయే వర్షాకాల సమావేశాల్లో తన నివేదికను సమర్పించనుంది. ఆగస్టులో జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలని కోరుతూ అన్ని పార్టీలు లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు సమర్పించాయి. దీని తర్వాత ఈ విషయంపై విచారణ జరిపేందుకు స్పీకర్ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే అభిశంసన ప్రక్రియ ప్రారంభం కాకముందే.. జస్టిస్ యశ్వంత్ వర్మ రాష్ట్రపతికి తన రాజీనామాను సమర్పించారు.