న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం కాదు: ప్రధాన న్యాయమూర్తి

న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే ఎల్లప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం కాదని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు.

By అంజి  Published on  5 Nov 2024 9:15 AM IST
Judiciary independence, government, Chief Justice, DY Chandrachud, Delhi

న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం కాదు: ప్రధాన న్యాయమూర్తి

నవంబర్ 10న పదవీ విరమణ చేయబోతున్న భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే ఎల్లప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం కాదని అన్నారు. కేసులపై నిర్ణయాలు తీసుకునే విషయంలో న్యాయమూర్తులను విశ్వసించాలని ప్రజలను కోరారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి ప్రసంగిస్తూ.. తాను ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కొట్టివేసి , కేంద్రానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినప్పుడు, తనను "చాలా స్వతంత్రుడు" అని పిలిచారని అన్నారు.

''మీరు ఎలక్టోరల్ బాండ్లను నిర్ణయించినప్పుడు, మీరు చాలా స్వతంత్రంగా ఉంటారు, కానీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే, మీరు స్వతంత్రులు కాదు.. అది స్వతంత్రతకు నా నిర్వచనం కాదు'' అని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. ఫిబ్రవరి 15న, సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని "రాజ్యాంగ విరుద్ధం"గా పేర్కొంటూ దానిని కొట్టివేసింది . ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ నిర్ణయంలో, 2018లో ప్రారంభమైనప్పటి నుండి పరిశీలనలో ఉన్న ఎలక్టోరల్‌ బాండ్ల వివాదాస్పద పద్ధతికి ముగింపు పలికింది.

అటు అంతకుముందు ప్రధాని మోదీ తమ నివాసానికి రావడంపైనా జస్టిస్‌ చంద్రచూడ్‌ వివరణ ఇచ్చారు. తన నివాసానికి ప్రధానమంత్రి రావడంలో తప్పులేదని స్పష్టం చేశారు. అది బహిరంగ భేటీయేనని, వ్యక్తిగత సమావేశం కాదని పేర్కొన్నారు. తాను గతంలో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో తాను ముఖ్యమంత్రితో, ముఖ్యమంత్రి తనతో సమావేశం అవ్వడం జరిగిందని చెబుతూ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు క్రమం తప్పకుండా సమావేశాలు కావడం ఒక ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు.

Next Story