బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి భారతీయ జనతా పార్టీలో చేరడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీంతో బెంగాల్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పార్టీ బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, పార్టీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ కోసం పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. సభకు మిథున్ చక్రవర్తి కూడా వచ్చారు. ఆ సభా వేదికపైనే కైలాష్ విజయవర్గీయ ఆయనకు పార్టీ కండువా కప్పారు. కొన్నేళ్ల పాటు తృణమూల్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగిన మిథున్ బీజేపీలో చేరారు.
ప్రధాని నరేంద్ర మోదీ కోల్ కతాలో నిర్వహించినప్పుడు మిథున్ చక్రవర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తన మాతృభాష బెంగాలీలో మాట్లాడుతూ.. తనను ఎలాంటి హాని చేయని నీటిపాముగా భావించవద్దని.. తాను త్రాచుపాము లాంటివాడినని తెలిపారు. ఒక్క కాటుతో చచ్చిపోతారని హెచ్చరించారు. జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలని అనుకునేవాడినని.. ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందుతున్న నరేంద్ర మోదీ వంటి మహానేత హాజరైన భారీ బహిరంగ సభలో పాల్గొంటానని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. సమాజంలో నిరుపేద వర్గాలకు సేవ చేయాలని కోరుకున్నానని, ఆ కోరిక ఇప్పుడు తీరనుందని మిథున్ తెలిపారు. బహిరంగసభలో మోదీ మాట్లాడుతూ బెంగాలీలు శాంతిని, సువర్ణ బెంగాల్ (సోనార్ బంగ్లా)ను కోరుకుంటున్నారని అన్నారు. బెంగాల్ ప్రజల సోనార్ బంగ్లా కలను బీజేపీ సాకారం చేస్తుందని హామీ ఇచ్చారు. బెంగాల్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. బెంగాల్ సంస్కృతి, కళల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అన్నారు.