బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది

Jharkhand CM Soren wins confidence motion with 48 votes in his favour. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో నెగ్గారు.

By Medi Samrat  Published on  5 Sep 2022 10:20 AM GMT
బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో నెగ్గారు. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న సోరెన్ అసెంబ్లీలో తన సత్తాను నిరూపించుకున్నారు. ఓటింగ్ కు ముందు బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. సభ్యుల్లో 48 మంది సోరెన్ కు అనుకూలంగా ఓటు వేశారు. 81 మంది సభ్యులున్న సభలో 48 ఓట్లతో అధికార కూటమి తీర్మానం ఆమోదం పొందింది. బీజేపీ, దాని మిత్రపక్షం AJSU పార్టీ, ఇద్దరు స్వతంత్రుల బహిష్కరణ మధ్య ఈ తీర్మానం ఆమోదించబడింది.

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని అన్నారు సోరెన్. బలపరీక్షలో నెగ్గిన అనంతరం సోరెన్ మాట్లాడుతూ.. తమ ఎమ్మెల్యేల మ‌ధ్య‌ చిచ్చు పెట్టి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. ఎన్నికల్లో గెలుపొందేందుకు అల్లర్లను సృష్టిస్తున్నారని అన్నారు. తమ రాష్ట్రంలో యూపీఏ అధికారంలో ఉన్నంత కాలం ఎలాంటి కుట్రలు సాగవని చెప్పారు. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు చేసిన ప్రయత్నం వెనుక అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ఉన్నారని ఆరోపించారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని.. ప్రజా ప్రతినిధులను సంతలో పశువుల్లా కొంటోందని అన్నారు. ప్రజలు కిరాణా సరుకులు, దుస్తులు తదితరాలను కొనటం మనం చూశామని... కానీ బీజేపీ మాత్రం ప్రజా ప్రతినిధులను కొంటోందని విమర్శించారు. "మా ముగ్గురు ఎమ్మెల్యేలు బెంగాల్‌లో ఉన్నారు. వారి బాధ్యత అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మపై ఉంది. దీనిపై విచారణ జరిపేందుకు ఆ రాష్ట్రాలకు వెళ్లే మా పోలీసులకు సహకరించడం లేదు JMM, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్‌ల అధికార కూటమికి చెందిన పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలతో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధినేత సోరెన్ సభకు వచ్చారు.


Next Story