రెండు దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది.
By Medi Samrat Published on 15 Oct 2024 4:23 PM ISTజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఈసారి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఎన్నికల సంఘం ప్రకటనతో జార్ఖండ్‌లో మోడల్ కోడ్ అమల్లోకి వచ్చింది.
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 28 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు, తొమ్మిది స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి. జార్ఖండ్‌లో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
ఈసారి ఓటింగ్ కోసం 29,562 పోలింగ్ బూత్‌లను ఎన్నికల సంఘం సిద్ధం చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో సగటున 881 మంది ఓటర్లు ఉంటారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈసారి 11.4 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఈ ఓటర్లు 18 నుండి 19 సంవత్సరాల వయస్సు గలవారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు తమ ఇళ్ల వద్దే ఓటు వేసే వెసులుబాటును కూడా ఎన్నికల సంఘం కల్పిస్తోంది.
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం సీట్లు 81. మెజారిటీకి 41 సీట్లు కావాలి. 2019లో జార్ఖండ్‌లో JMM-CONG-RJD సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. 2019 ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1, బీజేపీ 25 సీట్లు గెలుచుకున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి రఘువర్ దాస్ తన జంషెడ్‌పూర్ తూర్పు సీటును కూడా కాపాడుకోలేకపోయారు. ప్రస్తుతం జేఎంఎంకు 30 సీట్లు ఉన్నాయి. బీజేపీకి 20 సీట్లు ఉండగా, ఏజేఎస్‌యూకి రెండు సీట్లు, ఆర్జేడీకి ఒక సీటు ఉంది.