లైంగిక వేధింపుల కేసులో సూరజ్ రేవణ్ణకు బెయిల్

లైంగిక వేధింపుల కేసులో జెడి(ఎస్) ఎమ్మెల్సీ, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణకు కర్ణాటక కోర్టు బెయిల్ మంజూరు చేసింది

By Medi Samrat  Published on  22 July 2024 6:41 PM IST
లైంగిక వేధింపుల కేసులో సూరజ్ రేవణ్ణకు బెయిల్

లైంగిక వేధింపుల కేసులో జెడి(ఎస్) ఎమ్మెల్సీ, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణకు కర్ణాటక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని ప‌లు సెక్షన్ల కింద సూరజ్ రేవణ్ణపై అభియోగాలు మోప‌గా.. ప్రజాప్రతినిధి న్యాయస్థానం సోమవారం ఆయ‌న‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయడంతో పాటు దర్యాప్తుకు క్రమం తప్పకుండా హాజరుకావాల‌ని.. అనుమతి లేకుండా రాష్ట్రం బ‌య‌ట‌కు వెళ్ల‌రాదని కోర్టు షరతులను విధించిందని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. సూరజ్ రేవణ్ణను జూన్ 23న హాసన్ పోలీసులు పార్టీ కార్యకర్తపై లైంగికదాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 377 కింద జూన్ 22న హోలెనరసిపురా పోలీస్ స్టేషన్‌లో ఆయ‌న‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది.

సూరజ్ రేవణ్ణ కర్ణాటకలోని ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. అతడు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు. జెడి(ఎస్) ఎమ్మెల్యే హెచ్‌డి రేవణ్ణ, భవాని రేవణ్ణల కుమారుడు. ప్రజ్వల్‌పై కూడా లైంగిక వేధింపుల కేసులో జైలులో ఉన్నాడు. రేవణ్ణ సోదరులు మాజీ ప్రధాని, జెడి(ఎస్) అధినేత హెచ్‌డి దేవెగౌడ మనవళ్లు. కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి వారికి బాబాయి. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్యకర వీడియోలు బయటికి రావడంతో ఈ కుటుంబం వివాదంలో చిక్కుకుంది. మే 31న జర్మనీ నుంచి తిరిగి వచ్చిన ప్రజ్వల్‌ను బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిట్‌ అరెస్టు చేసింది. ప్ర‌స్తుతం ఆయ‌న క‌స్ట‌డీలోనే ఉన్నారు.

Next Story