రాహుల్ వ్యాఖ్యలకు జై శంకర్ కౌంటర్
Jaishankar hits back after Rahul Gandhi's 'arrogant' Indian diplomats remark. భారత్-చైనా సరిహద్దుల్లో.. చైనా ఓ బ్రిడ్జిని నిర్మించిందని విదేశీ వ్యవహారాల
By Medi Samrat
భారత్-చైనా సరిహద్దుల్లో.. చైనా ఓ బ్రిడ్జిని నిర్మించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ చైనా నిర్మించిన తొలి వారధి అసలు వారధి కాదని, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన పెద్ద వారధి నిర్మాణం కోసం కట్టినదని రక్షణ శాఖ వర్గాలు వివరించాయి. ప్యాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న రెండో వంతెన 1960 నుంచి ఆ దేశం అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతంలో ఉందని భారత్ శుక్రవారం స్పష్టం చేసింది. చైనా దాని మునుపటి వంతెనతో పాటు పాంగోంగ్ సరస్సుపై వంతెనను నిర్మిస్తున్నట్లు మేము నివేదికలను చూశామని.. ఈ రెండు వంతెనలు 1960 నుంచి చైనా ఆక్రమణలో కొనసాగుతున్న ప్రాంతాలలో ఉన్నాయని బాగ్చి చెప్పుకొచ్చారు.
ఇండియన్ ఫారిన్ సర్వీస్ దురహంకారపూరితమైనదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. లండన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, యూరోప్ దేశాల ఉన్నతాధికారులు తనతో మాట్లాడారని.. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (దౌత్యవేత్తలు) పూర్తిగా మారిపోయినట్లు వారు తనకు చెప్పారన్నారు. దౌత్యాధికారులు దురహంకారులు.. వారు దేనినీ వినరు. ఇప్పుడు వారు కేవలం తమకు వస్తున్న ఆదేశాలను మాత్రమే వెల్లడిస్తున్నారు అని తనకు చెప్పారని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ శనివారం ఘాటుగా స్పందించారు. మన దేశ విదేశాంగ విధానం ఆత్మవిశ్వాసంతో కూడినదని, జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు ఉపయోగపడేదని తెలిపారు. ''ఔను, ఇండియన్ ఫారెన్ సర్వీస్ పూర్తిగా మారింది. ఔను, వారు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నారు. ఔను, ఇతరుల వాదనలకు ప్రతివాదం చేస్తున్నారు. దానిని దురహంకారం అని అనరు. దానిని ఆత్మవిశ్వాసం అంటారు. దానిని జాతీయ ప్రయోజనాలను కాపాడటమంటారు'' అని వివరించారు.