కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. కనకపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ శుక్రవారం నామినేషన్ వేశారు. శివకుమార్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం ఆమోదించింది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. డీకే శివకుమార్ కు పోటీగా బీజేపీ నుంచి ఆర్ అశోక్ బరిలో ఉన్నారు.
కనకపుర నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు డీకే శివకుమార్. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మనీలాండరింగ్, పన్ను ఎగవేత కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను (ఐటీ) శాఖల ద్వారా పలు విచారణలను ఎదుర్కొంటున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నిటినీ కొట్టిపారేసిన ఆయన.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని ఆరోపించారు.
కనకపుర అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ మంత్రి ఆర్ అశోక్‌ను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపింది. దీంతో ఆయన ఇప్పుడు డీకే శివకుమార్‌తో పోటీ పడనున్నారు. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన అశోక్ మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పకు సన్నిహితుడు. రామనగర జిల్లాలోని కనకపుర సీటు వొక్కలిగ సామాజికవర్గానికి కంచుకోట. ఇక్కడ 60 శాతానికి పైగా ఓటర్లు వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారే. కనకపుర సీటును 1989 నుంచి కాంగ్రెస్ గెలుస్తూ వస్తోండటం విశేషం.