ఢిల్లీ: రాష్ట్రపతికి, గవర్నర్లకు బిల్లులపై ఆమోదం తెలపడానికి రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కోర్టు స్థిరమైన కాలపరిమితితో కట్టడి చేయలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అధ్యక్షుని రిఫరెన్స్ కేసు విచారణలో ఆరో రోజున రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 200, 201 ప్రకారం గవర్నర్, రాష్ట్రపతులు “అవకాశం వచ్చినంత త్వరగా” నిర్ణయం తీసుకోవాలని మాత్రమే పేర్కొనబడిందని, కానీ ఖచ్చితమైన టైమ్‌లైన్ విధించడం రాజ్యాంగ సవరణ అవసరమయ్యే అంశమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
తమిళనాడు తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదిస్తూ — బిల్లులపై గవర్నర్లు నిరవధికంగా ఆలస్యం చేస్తూ వస్తున్న నేపథ్యంలో 3 నెలల గడువు విధించడం అవసరమని చెప్పారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం స్పందిస్తూ, “ఇలా అన్ని సందర్భాల్లో ఒకే రకం గడువు నిర్ణయిస్తే అది రాజ్యాంగ సవరణ చేసినట్టవుతుంది” అన్నారు.
సింఘ్వి “సాధారణ టైమ్‌లైన్ లేకపోతే రాష్ట్రాలు ప్రతి సారి కోర్టుకే రావాల్సి వస్తుంది” అని వాదించగా, జస్టిస్ నరసింహా, జస్టిస్ విక్రమ్ నాథ్ లాంటి న్యాయమూర్తులు “గడువు విధించినా పాటించకపోతే పరిణామం ఏమిటి? గవర్నర్, రాష్ట్రపతిని కాంటెంప్ట్‌లోకి తేవాలా?” అని ప్రశ్నించారు. కోర్టు స్పష్టం చేస్తూ— ప్రతి సందర్భాన్ని వేర్వేరుగా పరిశీలించి అవసరమైతే కోర్టు ప్రత్యేకంగా కాలపరిమితి నిర్ధేశించగలదని, కానీ blanket rule విధించడం సాధ్యం కాదని తీర్మానించింది.