చిన్న తరహా ఉపగ్రహాల కోసం ఇస్రో సరికొత్త ప్లానింగ్
ISRO LIKELY TO LAUNCH ROCKET DEDICATED TO PRIVATE SATELLITES. దేశంలోని అన్ని ఇస్రో కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ రాకెట్ డిజైన్ చేసి చిన్న తరహా ఉపగ్రహాలను రెగ్యులర్‌గా ప్రయోగించేందుకు రూపొందించారు.
By Medi Samrat Published on 25 Jan 2021 7:59 AM ISTఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇటీవలి కాలంలో ఎన్నో అడుగులు ముందుకు వేసింది. సరికొత్త సాంకేతికను అందిపుచ్చుకుని చాలా వరకూ సక్సెస్ రేట్ తో ముందుకుకు వెళుతున్న ఇస్రో మీద పలు దేశాలు కూడా ఆధారపడ్డాయి. ఇక ఇస్రో స్వదేశీ, విదేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ఉపగ్రహ వాహకనౌక రూపకల్పన పూర్తి చేసి ఈ ఏడాది ప్రథమార్థంలోనే ప్రయోగించేందుకు సన్నాహకాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది ఎస్‌ఎఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగంతో పాటు విద్యార్థులు తయారు చేసిన ఆనంద్–01 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
2020లోనూ ఈ ప్రయోగం చేపట్టాలని ఇస్రో భావించింది. అయితే కోవిడ్–19 లాక్‌డౌన్ ప్రభావంతో ఈ ప్రయోగం ఆగిపోయింది. ఈ ఏడాది మాత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా పని పూర్తీ చేయాలని అనుకుంటూ ఉన్నారు. దేశంలోని అన్ని ఇస్రో కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ రాకెట్ డిజైన్ చేసి చిన్న తరహా ఉపగ్రహాలను రెగ్యులర్‌గా ప్రయోగించేందుకు రూపొందించారు. ప్రపంచ మార్కెట్‌లో అత్యంత చిన్న తరహా ఉపగ్రహాలను తక్కువ వ్యయంతో ప్రయోగించే విషయంలో భారత్ అగ్రగామిగా ఉంది. 2022 ఆఖరు నాటికి ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్లు ద్వారా వంద కిలోలు నుంచి 500 కిలోలు బరువు కలిగిన 6000 వేలు ఉపగ్రహాలను ప్రయోగించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే పీఎస్‌ఎల్‌వీ రాకెట్లు ద్వారా 33 దేశాలకు చెందిన 328 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టింది.
ఈ కొత్త ప్రయోగాల కోసం తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో కులశేఖర పట్నం అనే ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక ప్రయోగ వేదికను నిర్మించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే స్థల పరిశీలన చేసి భూసేకరణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగాన్ని ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ప్రయోగించాలని అనుకుంటూ ఉన్నారు.
వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను పంపించాల్సిన వ్యవహారానికి ప్రత్యేకంగా ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను రూపొందిస్తున్నారు. స్మాల్ శాటిలైట్ లాంఛింగ్ వెహికల్ రాకెట్‌ను నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. 34 మీటర్లు ఎత్తు, రెండు మీటర్లు వ్యాసార్థం కలిగి వుంటుంది. ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువు దాకా వుంటుంది. 500 కిలోలు బరువు కలిగిన ఉపగ్రహాలను భూమికి అతి దగ్గరగా వున్న లియో అర్బిట్‌లోకి ప్రవేశపెట్టే విధంగా డిజైన్ చేశారు. ఈ రాకెట్‌ను వర్టికల్ పొజిషన్‌లో పెట్టి ప్రయోగించనున్నారు. ఇస్రో మొదటి రోజుల్లో ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను కూడా వర్టికల్ పొజిషన్‌లోనే పెట్టి ప్రయోగించారు. దీనికి షార్ కేంద్రంలో పాత లాంచ్‌ప్యాడ్ కూడా సిద్ధం చేశారు. ఈ రాకెట్‌ను కూడా పీఎస్‌ఎల్‌వీ రాకెట్ లాగానే నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు మొదటి, మూడో దశలు ఘన ఇంధనం, రెండు, నాలుగో దశలు ద్రవ ఇంధనంతో ప్రయోగిస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను మాత్రం మొదటి, రెండు, మూడు దశలు ఘన ఇంధనంతోనే చేస్తారు. ఇందులో ద్రవ ఇంధనం దశమాత్రం వుండదు. నాలుగోదశలో మాత్రం వెలాసిటీ టైమింగ్ మాడ్యూల్ అనే దశ కొత్తగా అమర్చారు. ఆ దశలోనే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెడతారు.
విద్యార్థులు చిన్న చిన్న ఉపగ్రహాలను తయారు చేసినా వాటిని పంపడానికి.. వాణిజ్యపరంగా విదేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు భవిష్యత్తులో ఈ రాకెట్ ఉపయోగపడనుంది. చిన్న తరహా ఉపగ్రహాలను తయారు చేసుకుని ముందుకొస్తే ఇస్రో ఉచితంగా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంది.