క్షిపణి దాడికి గురైన ఇజ్రాయెల్ ఓడ గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవుకు చేరుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇజ్రాయెల్ లోని దార్ ఇస్ సలామ్ నుంచి మౌంట్ లోరి అనే సరుకు రవాణా నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు రావాల్సి ఉంది. ఈ క్రమంలో దార్ ఇస్ సలామ్ నుంచి బయలు దేరింది. అరేబియా సముద్రంలో ప్రయాణిస్తుండగా.. గురువారం ఓ మిస్సైల్(క్షిపణి ) ఆ ఓడను ఢీ కొట్టింది. సాధారణంగా నౌకను మిస్సైల్ ఢీ కొడితే.. అది తునాతునకలై సముద్రంలోనే మునిగిపోతుంది. అయితే.. మౌంట్‌లోరిని మిస్సైల్ ఢీ కొట్టినా.. షిప్పులోని కొంత భాగం మాత్రమే దెబ్బతింది.
దీంతో ఓ మూడు గంటలు అక్కడే అది నిలిచిపోయింది. అనంతరం అక్కడి నుంచి బయలు దేరి ఎక్కడా ఆగకుండా గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవుకు శుక్రవారం చేరుకుంది. క్షిపణి దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమానిస్తున్నట్లు వార్త సంస్థ రాయిటర్స్ పేర్కొంది. అయితే.. ఈ దాడి గురించి అటు ఇజ్రాయెల్ ప్రభుత్వం గానీ.. ఆ నౌకను నడుపుతున్న సంస్థగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత భద్రతా సంస్థలు కూడా ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. అయితే.. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒమన్ గల్ఫ్‌లో ఇజ్రాయెల్ ఓడలో పేలుడు సంభవించింది. దీనిపై ఇజ్రాయెల్ దేశ ప్రధాని మాట్లాడుతూ.. ఓడలో పేలువు సంభవించడానికి కారణం ఇరాన్ అని ఆరోపించారు.