కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అధ్యక్షుడు లేని లోటు కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉన్న సంగతి తెలిసిందే..! పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇక ఆ పార్టీ సీనియర్ నేతలను మీడియావర్గాలు పార్టీ అధ్యక్షుడిని ఎప్పుడు ఎన్నుకుంటారు.. ఎవరిని ఎన్నుకుంటారు అని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతకు కూడా చాలా చోట్ల ఇవే ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకేనేమో తాజాగా ఎంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చిదంబరం.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కేవలం తమ పార్టీ సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారని, టీవీ జర్నలిస్టులు కాదని చిదంబరం అన్నారు. సొంతంగా ఒక పార్టీని పెట్టుకుంటే అధ్యక్షుడిని జర్నలిస్టులు ఎన్నుకోవడం సాధ్యమవుతుందని జాతీయ టీవీ చానల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో చెప్పారు. 99 శాతం మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారని.. క్షేత్ర స్థాయిలో ఉండే కార్యకర్తలు కూడా ఇదే కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకు తాను 35 బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నానని.. ఎంతో మంది కార్యకర్తలతో భేటీ అయ్యానని చెప్పారు. 100 మంది కార్యకర్తల్లో 99 మంది రాహుల్ నే అధ్యక్షుడిగా కోరుకుంటున్నారని తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ పోటీ చేస్తారా? లేదా? అనే విషయం తనకు తెలియదని చెప్పారు. అధ్యక్ష పదవికి ఇతర నాయకులు కూడా పోటీ పడొచ్చని,తాము మాత్రం పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని అన్నారు.