కీలక మీటింగ్‌కు షిండే గైర్హాజరు.. మహాయుతిలో చీలిక తప్పదా.?
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మహాయుతిలో అంతా సవ్యంగా సాగేలా కనిపించడం లేదు.
By Medi Samrat Published on 12 Dec 2024 8:10 AM GMTమహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మహాయుతిలో అంతా సవ్యంగా సాగేలా కనిపించడం లేదు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖల పంపకాల సమస్య నెలకొంది. కొన్ని పెద్ద మంత్రిత్వ శాఖల విషయంలో డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో జరిగిన సమావేశానికి కూడా షిండే హాజరు కాలేదు.
మంత్రిత్వ శాఖల విభజనకు సంబంధించి బీజేపీ నాయకత్వంతో చర్చలు జరిపేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ తన మహాయుతి మిత్రులతో కలిసి నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. ఎన్‌సిపి చీఫ్ అజిత్ పవార్ కూడా సమావేశానికి హాజరయ్యారు, అయితే శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పెద్ద పదవుల కోసం షిండే పట్టుదలతో ఉన్నారని భావిస్తున్నారు.
షిండే పార్టీకి అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అనే ఒకే ఒక పెద్ద మంత్రిత్వ శాఖ ఇస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. షిండే ఇంతకుముందు హోం మంత్రిత్వ శాఖ కావాలని మొండిగా ఉన్నారు.. కానీ అది కుదరదని బీజేపీ బహిరంగంగా చెప్పడంతో ఆయన ఇతర మంత్రిత్వ శాఖలపై కన్నేశాడు. రెవెన్యూ, పబ్లిక్ వర్క్స్, హౌసింగ్, పరిశ్రమల వంటి పెద్ద మంత్రిత్వ శాఖలను శివసేన కోరుకుంటుంది.
అదే సమయంలో గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేతలకు మంత్రి పదవులు దక్కడం లేదన్న బీజేపీ పరిస్థితిపై కూడా షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి అమిత్ షాతో మంత్రి మండలి విస్తరణపై ఫడ్నవీస్ చర్చించారు. ఆయన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిశారు. అయితే షిండే గైర్హాజరు మాత్రం రాజకీయ చర్చకు దారితీసింది.