రైల్వే ట్రాక్‌పై ఇనుప షీట్లను ఉంచిన ముగ్గురు నిందితులను పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మల్బజార్ ప్రాంతంలో అరెస్టు చేశారు. ముగ్గురు వ్యక్తులు రైల్వే ప్రాంగణంలో ఇనుప షీట్లను దొంగిలించి.. వాటిని ముక్కలు చేసేందుకు రైలు పట్టాలపై ఉంచేవారు. సిలిగురి నుండి అలీపుర్‌దువార్‌ను కలిపే సేవక్-ఉద్లబరి స్టేషన్‌ల మధ్య మాంగ్‌పో సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఇనుప షీట్లు ఉంచారు. ఇది చూసిన కామాఖ్య ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ రైలును ఆపి ఆర్పీఎఫ్‌కు సమాచారం అందించాడు. ఇదే ట్రాక్‌పై క్యాపిటల్ ఎక్స్‌ప్రెస్ కూడా వెళ్లింది. దాని లోకో పైలట్ కూడా అదే సమాచారం ఇచ్చాడు.
రైల్వే సీపీఆర్వో కపింజల్ కిషోర్ శర్మ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని నేరగాళ్లు రైల్వేకు చెందిన ఇనుప వస్తువులను దొంగిలించేవారని తెలిపారు. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేందుకు రైలు పట్టాలపై ఉంచారన్నారు. రైలు పట్టాలపై ఇనుము, రాళ్లను పెట్టి రైలు ప్రమాదాలు జరిగేలా దేశంలోని పలు ప్రాంతాల్లో కుట్రలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే లోకో పైలట్లందరినీ అప్రమత్తం చేసింది. ఈ అప్రమత్తతతోనే ప్రస్తుత ప్రమాదం తప్పింది.