విషాదం.. మొదటి పోస్టింగ్‌కి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్ అధికారి మృతి

మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి కర్ణాటకలోని హసన్ జిల్లాలో తన మొదటి పోస్టింగ్‌లో బాధ్యతలు స్వీకరించడానికి వెళుతుండగా ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు.

By అంజి  Published on  2 Dec 2024 7:20 AM GMT
IPS officer died, road accident, first posting, Karnataka

విషాదం.. మొదటి పోస్టింగ్‌కి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్ అధికారి మృతి

మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి కర్ణాటకలోని హసన్ జిల్లాలో తన మొదటి పోస్టింగ్‌లో బాధ్యతలు స్వీకరించడానికి వెళుతుండగా ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. కర్నాటక కేడర్‌కు చెందిన 2023 బ్యాచ్ అధికారి అయిన 26 ఏళ్ల హర్ష్ బర్ధన్ మైసూరులోని కర్ణాటక పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. హాసన్‌కు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలోని కిట్టనే సమీపంలో సాయంత్రం 4.20 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

హసన్ జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్ధన్ ప్రయాణిస్తున్న పోలీసు వాహనం టైరు పగిలిపోవడంతో డ్రైవర్ జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ (డీఏఆర్) కానిస్టేబుల్ మంజేగౌడ చేతిలో నుండి వాహనం అదుపు తప్పింది. ఆ తర్వాత వాహనం ఓ ఇంటిని, రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. బర్ధన్‌ తలకు బలమైన గాయాలు కావడంతో హాసన్‌లోని జనప్రియ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరులోని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. డ్రైవర్ మంజెగౌడకు స్వల్ప గాయాలై హాసన్‌లో చికిత్స పొందుతున్నాడు.

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లాలోని దోసర్ గ్రామానికి చెందిన బర్ధన్, హోలెనరసిపూర్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు చేపట్టేందుకు హాసన్‌కు వెళ్తున్నాడు. అతని కుటుంబం బీహార్‌కు చెందినది, అతని తండ్రి అఖిలేష్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్నారు. శిక్షణ ద్వారా సివిల్ ఇంజనీర్ అయిన బర్ధన్ ప్రమాదానికి ముందు హాసన్‌లో ఆరు నెలల జిల్లా ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేశాడు. బర్ధన్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ కూడా ఈ నష్టానికి సంతాపం తెలిపారు.

Next Story