ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌.. జోధ్‌పూర్‌లో ఇంట‌ర్నెట్ సేవ‌లు బంద్‌

Internet services suspended in Jodhpur after violent clashes.రాజ‌స్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో రెండు వ‌ర్గాల మ‌ధ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 May 2022 10:54 AM IST
ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌.. జోధ్‌పూర్‌లో ఇంట‌ర్నెట్ సేవ‌లు బంద్‌

రాజ‌స్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ ఘ‌ర్ష‌ణ కారణంగా అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌రిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు, ఎలాంటి వదంతులు వ్యాపించ‌కుండా ఉండేందుకు జోధ్‌పూర్ జిల్లా వ్యాప్తంగా ఇంట‌ర్నెట్ స‌దుపాయాన్నినిలిపివేశారు.

అస‌లేం జ‌రిగిందంటే..?

ఈద్‌ను పుర‌స్క‌రించుకుని జోధ్‌పూర్‌లోని జ‌లోరీ గేట్ వ‌ద్ద జెండాల‌ను ఏర్పాటు చేసే విషయంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య సోమ‌వారం సాయంత్రం గొడ‌వ జ‌రిగింది. ఇది కాస్తా ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. ఇరు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం రాళ్లు రువ్వుకున్నాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకున్నారు. ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చేందుకు య‌త్నించ‌గా.. పోలీసుల‌పై రాళ్లు రువ్వారు.

దీంతో బాష్ఫ‌వాయువును ప్ర‌యోగించారు పోలీసులు. భారీ సంఖ్య‌లో పోలీసులను మోహ‌రించారు. ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చేందుకు, వ‌దంతుల‌ను అడ్డుకునేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపివేసింది. 2G/3G/4G/ మొబైల్ డేటాతో పాటు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, ఇత‌ర సోష‌ల్ మీడియా సేవ‌ల్ని ఆపేశారు.ఈరోజు రంజాన్ సందర్భంగా పోలీసు భద్రత మధ్యే ముస్లిం సోద‌రులు ప్రార్థ‌న‌లు చేసుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది.

ఈ ఘ‌ట‌న‌పై సీఎం అశోక్ గ‌హ్లోత్ స్పందించారు. ప్ర‌జ‌లంద‌రూ శాంతియుతంగా ఉండాల‌ని కోరారు. శాంతిభద్రతలకు ప‌ర్య‌వేక్షించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.


Next Story