International Yoga Day: అష్టాంగ యోగంలోని 8 మెట్ల గురించి తెలుసా?
సింధు నాగరికత కాలం నాటి నుంచి యోగా ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. కేవలం హిందూ మతంలోనే కాకుండా బౌద్ధంలో, జైనం, ఇస్లాం సమాజాల్లోనూ యోగాసనాలు ఉన్నాయి.
By అంజి Published on 21 Jun 2024 3:14 AM GMTInternational Yoga Day: అష్టాంగ యోగంలోని 8 మెట్ల గురించి తెలుసా?
ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాల్లో యోగా ఒకటి. ప్రతియేటా జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. నిజానికి ఈ జూన్ 21న యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది. 365 రోజుల్లో జూన్ 21న అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. అందుకే ఈ రోజు పగటి సమయం ఒక గంట ఎక్కువగా ఉంటుంది. అలాగే భారత్‌లో ప్రతి రోజూ తొలి సూర్యోదయం అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగితే.. ఈ రోజు తొలి సూర్యోదయం ఉజ్జయినిలో జరుగుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే.. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి నేటి రోజును కేటాయించారు. యోగాలో ముఖ్యమైన అష్టాంగ యోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అష్టాంగ యోగం..
సింధు నాగరికత కాలం నాటి నుంచి యోగా ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. కేవలం హిందూ మతంలోనే కాకుండా బౌద్ధంలో, జైనం, ఇస్లాం సమాజాల్లోనూ యోగాసనాలు ఉన్నాయి. ఈ యోగాలన్నింటికీ పతంజలి (దాదాపు శ్రీకృష్ణుడి కాలానికి చెందిన యోగి) ఒక రూపాన్ని ఇచ్చారు. ఈ పతంజలి యోగాల్లో అష్టాంగ యోగం ముఖ్యమైనది. అష్టాంగ యోగంలో ఎనిమిది మెట్లు ఉంటాయి. అవే.. యమ, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి.
యమ: సమాజంలో ఎలా నడుచుకోవాలనే విషయాన్ని యమ తెలియజేస్తుంది. ఇందులో అహింస, సత్యం, అపరిగ్రహం, అస్తేయం, బ్రహ్మచర్యం అనే ఐదు అంశాలు భాగంగా ఉంటాయి.
నియమం: వ్యక్తి వికాసానికి దోహదపడే సూత్రాల సమాహారమే నియమం. ఇందులో సౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన ఉంటాయి.
ఆసనాలు: యోగాసనాలనేవి ఈ ఆసనంలో భాగంగా ఉంటాయి. ఇది యోగాసనాలకు సంబంధించిన 84,000,000 భంగిమలను తెలియజేస్తుంది.
ప్రాణాయామం: ప్రాణాయామంలో ఒక ముక్కు రంధ్‌రం ద్వారా తీసుకున్న గాలిని కాసేపు బిగబట్టి.. మరో రంధ్రం నుంచి నిదానంగా వదులుతారు. తద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.
ప్రత్యాహారం: మనసును ప్రాపంచిక విషయాలకు దూరంగా తీసుకెళ్లేందుకు ప్రత్యాహారం దోహదపడుతుంది. ఇందులో ఇంద్రియాలను ఎలా జయించాలో నేర్చుకోగలుగుతారు. ధ్యాన్యాన్ని విజయవంతం చేయడంలో ప్రత్యాహారం కీలకం.
ధారణ: అలౌకిక భావనలను మనసుకు దగ్గర చేసేందుకు ధారణ ఉపయోగపడుతుంది. ఇందులో ఇంద్రియ నిగ్రహం సాధ్యమయ్యాక మెదడుకు ఏకాగ్రత, కేంద్రీకరణశక్తి, ధారణ పెరుగుతాయి.
ధ్యానం: ధ్యానం అంటే ఆలోచనల మీద అదుపు. అనేక అంశాల మీదికి దృష్టి మళ్లకుండా ఒక దాని మీదే కేంద్రీకరించడం నేర్చుకోగలిగితే అతుకులు లేని ఆలోచనల ప్రవాహం సాధ్యమవుతుంది.
సమాధి: ఇక్కడ వస్తువూ, ఆలోచనా ఒకటే. ఏకాగ్రత తర్వాతిదైన ఈ స్థితిలో శరీర మెలకువ స్థితి అంతర్థానమై మెదడు వస్తువుగా మారుతుంది. అది క్రమంగా ఉజ్జ్వల వెలుగుగా పరిణమిస్తుంది.