విమానాల రాకపోకలపై నిషేధం పొడిగింపు..!
International Air Services. అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన రద్దును మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు డైరెక్టర్
By Naresh Kumar Published on 29 Sep 2021 4:31 AM GMT
అక్టోబర్ 31 వరకు కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఆంక్షలు
కార్గో విమానసర్వీసులకు ఆంక్షల నుంచి మినహాయింపు
అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన రద్దును మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. లగ్జరీ, ప్యాసింజర్ విమానాల రద్దును అక్టోబర్ 31, 2021 వరకు పొడిగిస్తున్నట్లు డీజీసీఏ కార్యాలయం ప్రకటించింది. అయితే కార్గో కార్యకలాపాలకు సంబంధించిన విమాన సర్వీసులు యధావిధిగా కొనసాగుతాయని తెలిపింది. అలాగే ఎంపిక చేసిన రూట్లలో విమానాలు నడుస్తాయని డీజీసీఏ అధికారులు తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి అదుపు చేయుటకు 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. అయితే ఈ నిషేధాన్ని పరిస్థితులకు తగ్గట్లుగా పొడిగించుకుంటూ వచ్చారు. మరోవైపు భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న 25 దేశాలకు విమానాలు నడవున్నాయి. ముఖ్యంగా అమెరికా, కెన్యా, భూటాన్, మాల్దీవులు, ఫ్రాన్స్, యూకే, యూఈఏ, ఖతార్, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాలకు భారత్ నుండి విమాన సర్వీసులు నడవనున్నాయి.