కర్ణాటకలో హిజాబ్ వివాదంపై.. ఆ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పాఠశాలల్లో డ్రెస్ కోడ్‌పై రాష్ట్ర ప్రభుత్వ నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను కర్ణాటక హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం నుండి కాలేజీలను పునఃప్రారంభించడాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని కర్ణాటక హైకోర్టు గురువారం తెలిపింది. ఈ విషయంపై పూర్తి విచారణ జరిగేంత వరకు డ్రెస్ కోడ్‌పై ఎవరినీ బలవంతం చేయొద్దని కోర్టు పేర్కొంది. శాంతి, ప్రశాంతతను పునరుద్ధరించాలని చెబుతూ కోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
హిజాబ్ వివాదంపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు తన తుది ఉత్తర్వులు వచ్చే వరకు విద్యార్థులకు మతపరమైన చిహ్నాలను అనుమతించరాదని, తద్వారా పాఠశాల, కళాశాల ప్రాంగణాల్లో హిజాబ్, కాషాయ కండువా రెండింటి వినియోగాన్ని నిలిపివేయాలని గురువారం ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్తీ, జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ ఖాజీ జైబున్నెసా మొహియుద్దీన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. "మేము హిజాబ్ వివాదం విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలనుకుంటున్నాము. మేము ప్రతిరోజూ ఈ విషయాన్ని వింటాము. "అని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొనాలని, పాఠశాలలు, కళాశాలలు త్వరలో తెరవాలని ధర్మాసనం పేర్కొంటూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.