అస్సాం 'టీ' కథేంటో తెలుసా?
Interesting facts about Assam 'Tea' that you don't know. ప్రపంచంలోనే చైనా తర్వాత తేయాకు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇందుకు ముఖ్య కారణం అసోం
By అంజి Published on 7 Sep 2022 10:33 AM GMTప్రపంచంలోనే చైనా తర్వాత తేయాకు ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇందుకు ముఖ్య కారణం అసోం రాష్ట్రమే అని చెప్పాలి. ఎందుకంటే ఏటా 60కోట్ల కిలోలకుపైగా తేయాకు ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ దాదాపు 22లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వందల సంఖ్యలో టీ తోటలు ఉన్నాయి. దేశంలో అత్యధిక తేయాకు పంటలు అసోంలోనే ఎందుకు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
టీ పుట్టిందిలా..
మొట్టమొదటగా టీని చైనాలో కొనుగొన్నారు. క్రీస్తుపూర్వం 2,737లో షెన్ నాంగ్ అనే చక్రవర్తి ఓ రోజు తన కోటలోని తోటలో ఆయన కూర్చొని ఉన్నారట. పనిమనిషి రాజు తాగడానికి మంచినీటిని వేడి చేస్తుండగా కొన్ని ఆకులు గాలిలో తేలియాడుతూ వచ్చి వేడి చేస్తున్న నీటిలో పడ్డాయట. ప్రయోగాలు చేయడం షెన్‌కు అలవాటే కాబట్టి.. ఆకు పడిన నీటిని అలాగే తాగేశాడు. రుచి బాగుండటంలో ఆ ఆకులు ఏ చెట్టువో కనిపెట్టి వాటితో టీ తయారు చేయడం మొదలుపెట్టారు. అలా తొలిసారి టీ రుచి మానవుడికి తెలిసింది.
అసోంలో టీ..?
1660కాలంలో మన దేశంలో తేయాకును ఔషధంగా ఉపయోగించారు. తలనొప్పి, కడుపునొప్పి వచ్చినప్పుడు నీళ్లలో వేసి.. నిమ్మరసం కలిపి తాగేవారు. అప్పటికే సింగ్‌పోస్ తెగ ప్రజలు ఈ తేయాకులను పండిస్తున్నారు. అయితే 1823లో వ్యాపారం నిమిత్తం భారత్‌కు వచ్చిన స్కాంట్లాండ్ దేశస్థుడు రాబర్ట్ బ్రూస్ అసోంలోని రంగ్‌పుర్‌లో తేయాకు చెట్టు పెరుగుతుండటాన్ని గుర్తించాడు.
ఆ తర్వాత బ్రిటీష్ పరిపాలకులు 1839లో అసోం టీ కంపెనీ ఒకటి స్థాపించి తేయాకును పండించడం మొదలుపెట్టారు. వారి వద్ద పనిచేసిన మణిరామ్ దివాన్ అనే భారతీయుడు ఉద్యోగం మానేసి సొంతంగా తేయాకు తోటల్ని ఏర్పాటు చేసి, టీ పౌడర్ విక్రయించడం ప్రారంభించాడు. అలా 1862 నాటికి అసోం ప్రాంతంలో 160 తేయాకు తోటలు వెలిశాయి. ప్రస్తుతం 800కుపైగా తేయాకు తోటలు ఉన్నాయి.
టీ గార్డెన్ టైమ్ అంటే!
టైం జోన్ ప్రకారం ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో సమయం ఉంటుంది. భారత్‌లోనూ ఇండియన్ స్టాండర్డ్ టైంను అనుసరిస్తాం. కానీ, అసోంలోని తేయాకు తోటల్లో సమయం IST కన్నా ఒక గంట ముందుంటుంది. దీన్నే 'టీ గార్డెన్ టైమ్' అని పిలుస్తుంటారు. దేశప్రధాన భూభాగంతో పోలిస్తే ఈశాన్య ప్రాంతాల్లో సూర్యుడు తొందరగా ఉదయిస్తాడు. ఉదయం పూట తొందరగా వచ్చే వెలుతురుతో తేయాకు ఉత్పత్తిని పెంచుకోవాలని అప్పటి బ్రిటీష్ పాలకులు యోచించారు. దీంతో కూలీలను ఉదయం ఒక గంట ముందుగా తోటల్లో పనులకు రావాలని సూచించారు. అంటే తేయాకు తోటల్లో ప్రజలు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనులు చేస్తారు.ఇప్పటికీ తేయాకు తోటల్లో ఈ సమయాన్నే పాటిస్తున్నారు.