బాలికల విద్యను ప్రోత్సహించడానికి ఇది చాలా గొప్ప మార్గం అనే చెప్పాలి. ఎందుకంటే రాజస్థాన్‌లోని ఓ నవ వధువు తన కట్నం కోసం పెట్టిన డబ్బును బాలికల హాస్టల్ నిర్మాణానికి ఉపయోగించాలని కోరింది. బార్మర్ నగరంలోని కిషోర్ సింగ్ కనోడ్ కుమార్తె అంజలి కన్వర్. నవంబర్ 21న ఆమె ప్రవీణ్ సింగ్‌ను వివాహం చేసుకుంది. బాలికల హాస్టల్ నిర్మాణానికి కట్నం డబ్బు ఇవ్వాలని అంజలి తన తండ్రిని కోరింది. కిషోర్ సింగ్ కానోడ్ అంగీకరించి బాలికల హాస్టల్ నిర్మాణానికి రూ.75 లక్షలు విరాళంగా ఇచ్చారు.
దీంతో నవ వధువు అంజలికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు అందాయి. తనకు కట్నం కింద ఖాళీ చెక్కు ఇవ్వాలని ఆమె తన తండ్రిని ముందే అడిగింది. దీంతో తండ్రి సంతకం చేసిన చెక్కును ఇచ్చాడు. ఆ తర్వాత రూ.75 లక్షల చెక్కు రాసి ఆ మొత్తాన్ని బాలికల హాస్టల్ నిర్మాణానికి ఇచ్చారు. ఇప్పుడు అంజలి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు. దీనికి సంబంధించిన వార్తా కథనం క్లిప్పింగ్‌ను బార్మర్ రావత్ త్రిభువన్ సింగ్ రాథోడ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.