తమిళనాడులో గత కొద్దిరోజులుగా భారీగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ వర్షాలకు స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నైలో చోటు చేసుకున్న ఓ ఘటన మహిళా శక్తిని ప్రపంచానికి తెలియజేసింది. టీపీ చట్రం ఏరియాలోని ఓ శ్మశాన వాటికలో ఉదయ్ కుమార్ అనే యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. అతని శరీరంలో కదలికలను గమనించిన మహిళా సీఐ రాజేశ్వరి తక్షణమే ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. శ్మశాన వాటిక నుంచి ఆటో వరకు సీఐ రాజేశ్వరి ఉదయ్ కుమార్‌ను తన భుజాలపై మోసుకెళ్లారు. ఆ తర్వాత ఆటోలో ఉదయ్‌ను ఉంచి ఆస్పత్రికి తరలించారు.
యువకుడి ప్రాణాలను కాపాడిన సీఐ రాజేశ్వరిపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అయితే ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న మహిళా పోలీసు రాజేశ్వరి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దురదృష్టవశాత్తూ తాను కాపాడిన యువకుడి మరణించాడని బాధకు లోనయ్యారు. ఆ యువకుడిని కాపాడేందుకు మహిళా పోలీసు చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విధినిర్వహణలో రాజేశ్వరి చేసిన పనికి తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్ సైతం అభినందించారు.