దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా రన్‌వే పక్కకు జారీ.. విమానం టైరు బురద మట్టిలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని జోర్హత్ నుంచి కోల్‌కతాకు ఇండిగో ఫ్లైట్ 6E-757 బయలుదేరింది. రన్‌వే పై విమానం టేకాఫ్ అవుతుండగా రన్‌వే పై నుంచి జారింది. రెండు టైర్లు పక్కనే ఉన్న బురదలో ఇరుక్కుపోయాయి. ఈ ఘటనతో ప్రయాణీకులు కాస్త ఆందోళన చెందారు. అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణీకులు అందరిని క్షేమంగా విమానం నుంచి కిందకు దించారు. సాంకేతిక కారణాల వల్ల ఆ విమానాన్ని రద్దు చేసినట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 98 మంది ఉన్నారు. వారిని మరో విమానంలో గమ్యస్థానానికి చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల కొద్ది రోజులుగా పలు విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తున్నాయి. ఎక్కువగా స్పైస్‌జెట్, ఇండిగో విమానాల్లో ఈ లోపాలు ఎక్కువగా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన డీజీసీఏ చర్యలు చేపట్టింది. బేస్, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తరువాతే విమానాలు బయటకు రావాలనే నిబంధనను తప్పనిసరి చేసింది.