యుధ్ధం మిగిల్చిన విషాదం

Indian student killed in Ukraine. దేశం కాని దేశం, అనుకోని పరిస్థితులు, చుట్టూ హృదయవిదారక దృశ్యాలు, భయానక యుద్ధ వాతావరణం

By Nellutla Kavitha  Published on  4 March 2022 9:56 AM GMT
యుధ్ధం మిగిల్చిన విషాదం

దేశం కాని దేశం, అనుకోని పరిస్థితులు, చుట్టూ హృదయవిదారక దృశ్యాలు, భయానక యుద్ధ వాతావరణం మధ్యలో మన వాళ్లు మరణిస్తే, అసలు ఆ డెడ్ బాడీ ఎలా ఉందో, ఎక్కడుందో కూడా సమాచారం లేని పరిస్థితి ఉంటే, రోజులు గడుస్తున్నా మరణించిన కుమారుడి గురించి మరణవార్త తప్ప తన భౌతికకాయాన్ని చూసి, అంత్యక్రియలు చేసే పరిస్థితి అయినా లేకుంటే.. ఊహకు అందట్లేదు కదా, ఊహించడనికే కష్టంగా ఉంటే ఈ బాధను, కడుపుకోతను అనుభవిస్తున్న కుటుంబసభ్యుల మాటేంటి?!

చక్కగా చదువుతాడు, మంచి మార్కులు వచ్చాయి కానీ.. మన దగ్గర వైద్యవిద్యకు చాలా ఖర్చవుతుందని, వేల కిలోమీటర్ల దూరంలో అయినా తక్కువ ఖర్చుతో చదువుకుని డాక్టర్ అయిన తన కుమారుడు నవీన్ ను చూడాలనే ఆశతో, అప్పుచేసి మరి ఉక్రెయిన్ పంపించారు తండ్రి శేఖరప్ప. రైతు కుటుంబంలో పుట్టినా.. తన కొడుకు డాక్టర్ అవుతాడని, పట్టా తీసుకునే సమయానికి తను కూడా వెళ్లాలని ఆశపడ్డాడు. కాని, ఉప్పెనలా వచ్చిన యుద్ధం వారి కలల్ని కల్లలు చేసింది, కడుపుకోత మిగిల్చింది. వేల సంఖ్యలో ఉన్న మన విద్యార్ధుల్ని సురక్షితంగా తీసుకురావడానికి ఆపరేషన్ గంగ పేరుతో విమానాల్ని ఏర్పాటుచేసినా, జరగరాని ఘోరం జరిగిపోయింది.

తిండి, నీరు, నిద్ర లేకుండా బంకర్లలో తలదాచుకుంటున్న వేలాదిమందిలో నవీన్ ఒకరు. కాస్త సమయం దొరికిన వెంటనే ఉక్రెయిన్ ఖార్కివ్ లో సరుకులకోసం బయటికొచ్చి, ఇంటికి ఫోన్ చేసి అక్కడి విషయాల గురించి చెప్పారు నవీన్. తన వంతుకోసం లైన్లో ఎదురుచూస్తున్నపుడు వచ్చిపడ్డ క్షిపణి నవీన్ ప్రాణాలు తేసింది, అక్కడిక్కడే కుప్పకూలాడు ఆ వైద్యవిద్యార్ధి. కేంద్ర విదేశాంగ శాఖ నవీన్ మరణించిన విషయాన్ని తల్లితండ్రులకు చేరవేసింది. డాక్టర్ అయి తమ కళ్లముందు ఉంటాడనుకున్న కుమారుడు డెడ్ బాడీ అయ్యాడన్న విషయం ఇప్పటికీ ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది.

రెండు రోజులు గడిచాయి కానీ నవీన్ భౌతిక కాయం ఎక్కడుంది, ఎలా ఉంది, ఎప్పుడు తీసుకొస్తారు.. ఏ విషయం తెలియట్లేదు ఆ తల్లితండ్రులకు, ఎవరు సమాచారం ఇస్తారో కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ చదువుకొనలేక విదేశాలకు పంపిస్తే, అక్కడ ఏర్పడ్డ సంక్షోభం తమ కుమారుడి మరణానికి కారణం కావడమే కాదు అసలు అంత్యక్రియలు చేస్తామో లేదో అనే అనుమానంగా ఉందని, ఇప్పుడు తన కుమారుడి డెడ్ బాడీ కేరాఫ్ ఫుట్ పాత్ గా మారిందని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు తల్లితండ్రులు. అక్కడున్న మన వారిలో చివరి విద్యార్ధిని కూడా సురక్షితంగా తీసుకొస్తామన్న కేంద్రం నవీన్ భౌతికకాయాన్ని కూడా తీసుకొచ్చే ఏర్పాట్లుచేయాలని వేడుకుంటున్నారు.

యుద్ధంలో చివరికి మిగిలేది ఏ దేశమయినా, పరాజితులు, విజేతలెవరయినా బాధితులుగా మాత్రం మిగిలేది అమాయకులే అని చరిత్రలో చదువుకున్నామని ఇప్పుడు సజీవంగా చూస్తున్నామని అంటున్నారు నవీన్ కుటుంబసభ్యులు. దారుణమైన పరిస్థితుల మధ్య, అందరూ ఉన్నా అనాధగా మరణించడం, కనీసం భౌతికకాయం ఎక్కడుందో కూడా తెలియని దుస్థితి ఎవరికీ రాకూడదంటున్నారు వారు. తమకు ధైర్యం చెప్పే కుమారుడి మరణం ఇప్పుడు తమను ఒంటరి చేసిందని, కేంద్రం స్పందించి తమకు సహకారం అందించాలంటున్నారు ఆ కుటుంబసభ్యులు. యుద్ధం ఒక భీకర విషాదం.


Next Story