రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై జనరల్ బోగీల్లో ప్రతి గంటకోసారి క్లీనింగ్

రైల్వే ప్రయాణికుల ఫిర్యాదుల్లో అత్యధికంగా ఉండే 'అపరిశుభ్రత' సమస్యకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది

By -  Knakam Karthik
Published on : 15 Feb 2026 8:35 PM IST

National News, IndianRailways, General Coach Cleaning, SCR, SwaachBharat

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై జనరల్ బోగీల్లో ప్రతి గంటకోసారి క్లీనింగ్

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికుల ఫిర్యాదుల్లో అత్యధికంగా ఉండే 'అపరిశుభ్రత' సమస్యకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. రిజర్వేషన్ కోచ్‌లతో సమానంగా ఇకపై జనరల్ బోగీల్లోనూ అత్యుత్తమ స్థాయి శుభ్రతను పాటించాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి గంటకోసారి జనరల్ కోచ్‌లను శుభ్రపరిచేలా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

ప్రతి గంటకోసారి 'క్లీనింగ్.. ఎలాగంటే?

సాధారణంగా జనరల్ బోగీల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల చెత్త, అపరిశుభ్రత ఎక్కువగా ఉంటుంది. రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు 'క్లీనింగ్ స్టాఫ్' ప్రతి గంటకు ఒకసారి జనరల్ బోగీలోకి ప్రవేశించి చెత్తను తొలగించడంతో పాటు, నేలను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద దేశవ్యాప్తంగా అత్యధిక రద్దీ ఉండే 80 రైళ్లను రైల్వే శాఖ ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్ నుండి 5 కీలక రైళ్లలో ఈ సేవలు మొదటగా ప్రారంభం కానున్నాయి.

ఎందుకు ఈ నిర్ణయం?

సాధారణంగా స్లీపర్, ఏసీ కోచ్‌లలో 'ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్' (OBHS) సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ, జనరల్ బోగీల్లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటోంది. ప్రయాణికుల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో, రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు సురక్షితంగా, పరిశుభ్రమైన వాతావరణంలో ప్రయాణించేలా చూడటమే ఈ చర్య ప్రధాన ఉద్దేశ్యం.

త్వరలో మరిన్ని రైళ్లకు విస్తరణ

మొదటి దశలో ఎంపిక చేసిన 80 రైళ్లలో వచ్చే ఫలితాలను బట్టి, ఈ సేవలను దశలవారీగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లకు విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది. దీనివల్ల సామాన్య ప్రయాణికులకు ఎంతో మేలు చేకూరనుంది.

Next Story