Indian Railways : 17 రోజుల 'శ్రీ రామాయణ యాత్ర' టూర్.. ఎలా సాగుతుందంటే.?
భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. భారత్ కు చెందిన పర్యాటకులే కాకుండా, ప్రతి సంవత్సరం విదేశాల నుండి వచ్చే సందర్శకులు సైతం తీర్థయాత్రల కోసం భారతదేశానికి వస్తుంటారు.
By - Medi Samrat |
భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. భారత్ కు చెందిన పర్యాటకులే కాకుండా, ప్రతి సంవత్సరం విదేశాల నుండి వచ్చే సందర్శకులు సైతం తీర్థయాత్రల కోసం భారతదేశానికి వస్తుంటారు. భారతీయ రైల్వే భారతదేశం, నేపాల్‌లోని రామాయణ ప్రదేశాలను కవర్ చేస్తూ 17 రోజుల 'శ్రీ రామాయణ యాత్ర' టూర్‌ను ప్రారంభించింది.
శ్రీరాముని జీవితానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలను కవర్ చేస్తూ శ్రీ రామాయణ యాత్ర టూర్ మార్చి 30న ప్రారంభమవుతుంది. ఈ 16-రాత్రులు, 17-రోజుల ప్రయాణంలో, రైలు అయోధ్య, నందిగ్రామ్, సీతామర్హి, జనక్‌పూర్, బక్సర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, శృంగవేర్‌పూర్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం వంటి ప్రముఖ ప్రదేశాలలో ఆగుతుంది. ఈ టూర్ 'భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ' టూరిస్ట్ రైలులో సాగుతుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అధికారుల ప్రకారం, ఈ అత్యాధునిక రైలు ఆధునిక సౌకర్యాలతో పూర్తిగా సన్నద్ధమై ఉంది. ఈ రైలులో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ అనే మూడు రకాల వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో ఆధునిక వంటగది, రెండు రెస్టారెంట్లు, సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్ ఫంక్షన్లు, కోచ్‌లలో షవర్ క్యూబికల్స్, ఫుట్ మసాజర్‌లతో ప్రయాణికుల మెరుగైన భద్రత కోసం ప్రతి కోచ్‌లో సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు అందుబాటులో ఉంటారు.
ఈ యాత్ర సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభమవుతుంది. మొదటి గమ్యస్థానం అయోధ్య. ఇక్కడ పర్యాటకులు రామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గర్హి, రామ్ కి పైడీలను సందర్శిస్తారు. ఆ తర్వాత, భరత్-హనుమాన్ ఆలయం, భరత్ కుండ్‌లను సందర్శించడానికి రైలు నందిగ్రామ్‌కు ప్రయాణిస్తుంది. బీహార్‌లోని సీతామర్హికి కూడా ఈ రైలు వెళుతుంది. అక్కడి నుండి పర్యాటకులు రోడ్డు మార్గం ద్వారా నేపాల్‌లోని జనక్‌పూర్‌కు వెళ్లి సీతాదేవి జన్మస్థలమైన జానకి ఆలయం, ధనుష్ ధామ్ ఆలయం, పరశురామ్ కుండ్‌లను సందర్శిస్తారు. బక్సర్ లోని రామ్ రేఖ ఘాట్, రామేశ్వర్ నాథ్ ఆలయం, వారణాసి లోని తులసి మానస్ ఆలయం, సంకట్ మోచన్ ఆలయం, కాశీ విశ్వనాథ్ ఆలయం గంగా హారతి, ప్రయాగ్‌రాజ్ లోని త్రివేణి సంగమం, హనుమాన్ ఆలయం, భరద్వాజ ఆశ్రమం,
శృంగవేర్‌పూర్ లోని శృంగి రుషి ఆలయం, చిత్రకూట్ లోని గుప్త గోదావరి, రామ్ ఘాట్, సతీ అనసూయ ఆలయం, నాసిక్ లోని త్రయంబకేశ్వర్ ఆలయం, పంచవటి లోని సీతా గుహ, కాలారామ్ ఆలయం, హంపి లోని అంజనాద్రి హిల్, విరూపాక్ష ఆలయం, విఠల్ ఆలయం, రామేశ్వరం లోని రామనాథస్వామి ఆలయం, ధనుష్కోడి సందర్శిస్తారు. ఇక ఈ యాత్రలో మొత్తం 7,560 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, 17వ రోజు ఈ రైలు తిరిగి ఢిల్లీ చేరుకుంటుంది.
ఈ ప్యాకేజీ ధరల విషయానికొస్తే, ఒకరికి 3AC కి 1,14,100 రూపాయలు, 2AC కి 1,51,225 రూపాయలు, 1AC కి 1,64,940 రూపాయలుగా రైల్వే శాఖ నిర్ణయించింది. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ఆధారంగా పర్యాటకులకు అత్యల్ప ఛార్జీ రూ. 1,11,630 గా ఉంటుంది.