నేడు నౌకాదళంలో చేరనున్న 'మహే'.. తీరంలో ఓ 'నిశ్శబ్ద వేటగాడు'
దేశ రక్షణ సన్నద్ధత విషయంలో నేవీ స్వయం ప్రతిపత్తి దిశగా మరో అడుగు వేయబోతోంది. 80 శాతం స్వదేశీ మెటీరియల్‌తో తయారు చేసిన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షిప్ 'మహే' సోమవారం నావికాదళంలోకి ప్రవేశించనుంది.
By - Medi Samrat |
దేశ రక్షణ సన్నద్ధత విషయంలో నేవీ స్వయం ప్రతిపత్తి దిశగా మరో అడుగు వేయబోతోంది. 80 శాతం స్వదేశీ మెటీరియల్‌తో తయారు చేసిన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షిప్ 'మహే' సోమవారం నావికాదళంలోకి ప్రవేశించనుంది. నేవీలో చేరబోతున్న మహే తరగతికి చెందిన తొలి ఆధునిక యుద్ధనౌక ఇది. ఇలాంటి మరో ఎనిమిది యుద్ధనౌకలను నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉంది.
మహే క్లాస్ 'యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్' ప్రారంభోత్సవం ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో జరగనుంది. దీనిని వెస్ట్రన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ హోస్ట్ చేయనుండగా, కార్యక్రమానికి ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అధ్యక్షత వహిస్తారు.
'మహే' ఇండక్షన్ కొత్త తరం స్వదేశీ నిస్సార నీటి యుద్ధనౌకలకు నాందిగా పరిగణించబడుతుంది. ఇవి వేగంతో పాటు చురుకైనవి. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినవి. షిప్‌లో 80 శాతానికి పైగా స్వదేశీ విడిభాగాలను ఉపయోగించారు. ఇది భారత్‌లో అభివృద్ధి చెందుతున్న డిజైన్, తయారీ సామర్థ్యాలకు నిదర్శనం.
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన 'మహే' పశ్చిమ సముద్ర తీరంలో 'నిశ్శబ్ద వేటగాడు' పాత్రను పోషించేలా రూపొందించబడింది. సముద్రపు లోతులో శత్రు జలాంతర్గాములను గుర్తించడం, తీరప్రాంత పెట్రోలింగ్ నిర్వహించడం.. కీలకమైన సముద్ర మార్గాల భద్రతను నిర్ధారించడం వంటి సామర్ధ్యం ఈ నౌకకు ఉంది. మలబార్ తీరంలోని చారిత్రాత్మక పట్టణం మాహే పేరు ఈ నౌకకు పెట్టబడింది.
'మహే' లక్షణాలు
సముద్రానికి బదులుగా, తీరప్రాంత జలాలు లేదా నదీ ముఖద్వారాలు వంటి నిస్సార నీటి ప్రాంతాలలో యుద్ధనౌక పనిచేస్తుంది.
దీనికి టార్పెడోలు, బహుళ-పాత్ర జలాంతర్గామి నిరోధక క్షిపణులు, అధునాతన రాడార్, సోనార్‌లను అమర్చారు.
ఈ ప్రాజెక్టు కింద మొత్తం ఎనిమిది అత్యాధునిక నౌకలను నిర్మిస్తున్నారు, ఇందులో ఇదే మొదటిది.
అత్యాధునిక సోనార్ సిస్టమ్ సముద్రపు లోతుల్లో జరిగే కార్యకలాపాలను గుర్తించనుంది.
80% స్వదేశీ విడిభాగాలతో తయారు చేయబడిన ఈ యుద్ధనౌక దాని స్టెల్త్ సామర్ధ్యం కారణంగా శత్రువులకు కనిపించదు.
గరిష్టంగా గంటకు 25 నాట్ల వేగంతో పెట్రోలింగ్ చేయగలదు.
78 మీటర్ల పొడవున్న ఈ నౌక డీజిల్ ఇంజన్-వాటర్‌జెట్ కలయికతో పనిచేస్తుంది.
నావికాదళం కోసం మహే తరగతికి చెందిన 8 యుద్ధనౌకలను తయారు చేయనున్నారు.