ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన మిరాజ్-2000 యుద్ధ విమానం కుప్పకూలింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేండ్ జిల్లాలో ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే విమానంలో ఉన్న పైలట్ మాత్రం సురక్షితంగా ఉన్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసింది. బేండ్ జిల్లా కేంద్రానికి 6 కిలో మీటర్ల దూరంలోని మంకాబాద్‌లోని ఖాళీ భూముల్లో విమానం శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. విమానం యొక్క తోక భాగం భూమిలోపలికి చొచ్చుకుపోయింది.
ఘటన జరిగిన ప్రాంతం చుట్టూ పోలీసులు కార్డన్ ఏర్పాటు చేశారు. శిక్షణా సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణకు ఆదేశించామని ఐఎఎఫ్ తెలిపింది. విమానం కూలిపోయే ముందు పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని బేండ్ పోలీస్ సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. విమానం కూలిన తర్వాత మంటలు చెలరేగాయన్నారు. గ్వాలియర్‌లోని మహారాజ్‌పురా ఎయిర్‌బేస్ నుండి ఉదయం సమయంలో విమానం బయలుదేరిందని అధికారి తెలిపారు.