భారత్‌కు ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవులను ఒకే వర్గానికి పరిమితం చేసే పాకిస్థాన్‌లా కాకుండా అన్ని వర్గాల ప్రజలకు దేశ రాజ్యాంగం సమాన హోదా కల్పించినందున హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒక రోజు భారత ప్రధాని అవుతారని ఒవైసీ అన్నారు.
మహారాష్ట్ర సోలాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగిస్తూ.. భారత్, పాక్ రాజ్యాంగాల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. "పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం ఒక నిర్దిష్ట మతానికి చెందిన వారే ప్రధాని కావాలి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన మన రాజ్యాంగం మాత్రం ఏ భారత పౌరుడైనా ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మేయర్ కావచ్చని చెబుతోంది. ఈ దేశానికి హిజాబ్ ధరించిన కూతురు ప్రధాన మంత్రి అయ్యే రోజు వస్తుందనేది నా కల" అని ఆయన పేర్కొన్నారు.
ఒవైసీ వ్యాఖ్యలపై మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది హిందూ రాష్ట్రమని.. ఇక్కడ 90 శాతం జనాభా హిందువులేనని ఆయన గుర్తు చేశారు. "ముంబయిలో బుర్కా లేదా హిజాబ్ ధరించిన మహిళ మేయర్ కానీ, ప్రధాని కానీ కాలేరు. అటువంటి కోరికలు ఉన్నవారు ఇస్లామాబాద్‌కో, కరాచీకో వెళ్లిపోవాలి. ఇక్కడ అలాంటి వారికి చోటు లేదు. బీఎంసీ (ముంబై కార్పొరేషన్) పై కేవలం హిందూ-మరాఠీ జెండానే ఎగురుతుంది" అని రాణే స్పష్టం చేశారు.